ఎయిర్ పోర్టులోకి వెళ్లి.. హెలికాఫ్టర్ ను గుల్ల చేశాడే

Update: 2020-02-03 10:18 GMT
ఎయిర్ పోర్టు అంటే ఎంత భద్రత ఉంటుంది? అన్ని పత్రాలు చేతిలో ఉన్నా.. డేగ కళ్లతో అనుమానాస్పద చూపులతో.. అన్నింటిని చెక్ చేసి కానీ లోపలకు పంపరు. ఆ తర్వాత కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విమానం వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటిది భోపాల్ ఎయిర్ పోర్టులోకి మాత్రం ఇరవైఏళ్ల యువకుడు ఒకరు అక్రమంగా విమానాశ్రయంలోకి వెల్లటమే కాదు.. అక్కడున్న హెలికాఫ్టర్ ను ధ్వంసం చేసిన వైనం సంచలనంగా మారింది.

భోఫాల్ లోని రాజభోజ్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండే ఎయిర్ పోర్టులోకి అక్రమంగా చొరబడ్డాడు భోపాల్ కు చెందిన యోగేశ్ త్రిపాఠిగా గుర్తించారు. ఎందుకీ పని చేశాడన్న విషయంపై విచారణ జరుగుతోంది. అక్రమంగా లోపలకు చేరిన అతగాడు.. రాధా సోమీ సత్సంగ్ బ్యాస్ అనే పెద్ద మనిషి హెలికాఫ్టర్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. దీంతో.. ముందు భాగమంతా పప్పు పప్పుగా మారింది.

అనంతరం స్పైస్ జెట్ విమానం ముందుకు వెళ్లి కూర్చున్నాడు. అయితే.. ఎయిర్ పోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది అతడ్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అప్పటికే హెలికాఫ్టర్ ధ్వంసమైంది. ఇతగాడి చర్యతో స్పైస్ జెట్ విమానం దాదాపు గంటకు పైగా ఆలస్యంగా నడిచింది. 46 మంది ప్రయాణికులతో ఉదయ్ పూర్ వెళ్లాల్సిన విమానం లేట్ కావటంతో పాటు..ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే.. ఎందుకీ పని చేశాడన్న విషయం మీద మాత్రం విచారణ సాగుతోంది.


Tags:    

Similar News