వారంతా పేరుకు పవన్ కల్యాణ్ అభిమానులు....ఆ మాటకొస్తే జనసేన కార్యకర్తలు కూడా.....పవన్ సినిమా విడుదలైనపుడు - జనసేన మీటింగ్ ల సమయంలో వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు....అయితే, ఇదంతా నాణేనికి ఓ వైపు. పవన్ అభిమానులనే ముసుగులో యువతులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బు దోచేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ మాయ ముఠా చేతిలో చాలామంది యువతులు మోసపోగా....చివరకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో వారి గుట్టు రట్టయింది. తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏలూరుకు చెందిన దత్తి బాలాజీ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ జనసేనలో తిరుగుతూ ఉండేవాడు. అతడికి తోడుగా బాలు - దేవేంద్ర మరి కొందరు స్నేహితులంతా కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. పవన్ అంటే అభిమానమున్న ధనవంతుల కుమార్తెలను వీరు టార్గెట్ చేసేవారు. ఫేస్ బుక్ లో చాటింగ్ చేయడం, పరిచయం పెంచుకోవడం వంటివి చేసేవారు. పవన్ తో కలిసి ఫొటోలు దిగే చాన్స్ ఇప్పిస్తామని, మాయమాటలు చెప్పి డబ్బు - నగలు గుంజేవారు. ఏలూరులో ఎంసీఏ చదువుతోన్న ఓ బంగారు వ్యాపారి కుమార్తె(20) నుంచి మూడున్నర కేజీల బంగారాన్ని కాజేశారు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. భీమవరం - విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా పలువురు యువతులు ఈ ముఠా బారిన పడ్డారు. ఈ ముఠాలోని కొందరు సభ్యులపై గతంలోనే రౌడీ షీట్ తో పాటు కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు ఓ యువతి ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో ఏలూరు వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.