ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై రాళ్ల దాడి..ఇప్పుడెక్కడంటే?

Update: 2020-01-07 10:54 GMT
టీవీ ఆన్ చేసినా.. పేపర్ మడత తీసినా.. తరచూ కనిపించే ఆర్థిక సేవల సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కావు. బంగారం కుదవ పెడతారా? లేదా? అన్నది పక్కన పెడితే.. బంగారం కుదవపెట్టాలన్న ఆలోచన వచ్చే చాలా మందికి ముందు గుర్తుకు వచ్చేది ముత్తూట్ ఫైనాన్స్  కంపెనీనే. ఆ సంస్థ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై తాజాగా దాడి జరగటం సంచలనంగా మారింది.

కోచిలో ఆయన కారులో వస్తుండగా కొందరు ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు ధ్వంసం కావటమే కాదు.. ఆయన గాయపడ్డారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సంస్థకు చెందిన వ్యక్తులే దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించింది.

ఈ ఆరోపణల్ని సీఐటీయూ ఖండించింది. తాము ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు పాల్పడమని ఆ సంఘ నేత అనంతలవట్టమ్ ఆంనదన్ స్పష్టం చేశారు. ఇంతకీ ముత్తూట్ ఎండీకి..సీఐటీయుకి మధ్యనున్న లొల్లి ఏమిటన్న విషయంలోకి వెళితే.. గత ఏడాది డిసెంబరులో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి దేశ వ్యాప్తంగా ఉన్న 43 బ్రాంచుల్లో 160 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

దీనిపై సరదు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారికి సీఐటీయూ మద్దతు పలుకుతోంది. వారి అధ్వర్యంలోనే ఆందోళనలు చేస్తున్నారు. దీంతో.. తాజా దాడి వెనుక సీఐటీయూ హస్తం ఉందన్న అనుమానాన్ని సంస్థ వ్యక్తం చేస్తోంది. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి.. విచారణలో కానీ అసలు నిందితులు ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    

Similar News