కేటీఆర్ ను తప్పించయినా పదవులు ఇవ్వాలట!

Update: 2015-07-12 01:58 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు మంత్రివర్గ కూర్పు విషయంలో కొత్త సలహా ఇచ్చాడు ఎమ్ ఆర్పీఎస్ నేత మందకృష్ణమాదిగ. ఎస్సీలకు మంత్రివర్గంలో మరింత ప్రాధాన్యతను పెంచాలని.. కొత్త వారికి  మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు కొత్త ప్రతిపాదన పెట్టాడు మందకృష్ణ. ఒకవైపు కేసీఆర్ పై ధ్వజమెత్తుతూనే.. కేసీఆర్ దళితులకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదంటూనే మందకృష్ణ కేసీఆర్ కు కొన్ని సూచనలు ఇచ్చారు.

ఈ సూచనల సారాంశం ఏమనగా.. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి తప్పించి అయినా.. ఇద్దరు దళితులకు మంత్రి పదవులు ఇవ్వాలనేది. మంత్రి పదవి కోసం ఎదురుచూపుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలోని దళిత ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలని.. దీని కోసం కేటీఆర్ ను పదవి నుంచి తప్పించినా తప్పులేదని మందకృష్ణ వ్యాఖ్యానించాడు. మరి దళితుల తరపున వకల్తా పుచ్చుకొని ఎస్సీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం సబబే.

అయితే కేటీఆర్ ను తప్పించి అయినా.. ఎస్సీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్ చేయడం ఒకింత విడ్డూరమైన అంశం. ఎందుకంటే కేటీఆర్ నేపథ్యం అందరికీ తెలిసిందే. కేసీఆర్ వారసుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్నాడాయన. ఇలాంటినేపథ్యంలో మందకృష్ణ ఏకంగా కేటీఆర్ ను తప్పించి ఇద్దరు దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలి అనడం విడ్డూరమైన డిమాండే! ఇలాంటి డిమాండ్లను కేసీఆర్ లెక్కజేస్తాడా?!
Tags:    

Similar News