కేసీఆర్ రియాక్ట్ కాకుంటే రాష్ట్రబంద్‌!

Update: 2017-12-24 05:02 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌రిగిన ఉద్యమ సంద‌ర్భంగా బంద్ లు..ఆందోళ‌న‌ల‌తో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత బంద్ మాట దాదాపుగా జ‌నం మ‌ర్చిపోయిన ప‌రిస్థితి. తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న కేసీఆర్‌ కు బంద్ అంటూ ప్ర‌క‌టించే ధైర్యాన్ని ఎవ‌రూ చేయ‌ని ప‌రిస్థితి.

ప్ర‌భుత్వంతో సున్నం పెట్టుకోవ‌టానికి ఎవ‌రూ సాహించ‌టం లేద‌న్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ‌.. రాష్ట్ర బంద్‌ ను డిక్లేర్ చేసింది ఎమ్మార్పీఎస్‌.

వ‌ర్గీక‌ర‌ణ‌పై త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని స‌రిదిద్దాలంటూ ఎప్ప‌టి నుంచో ఆందోళ‌న చేస్తున్న మంద‌కృష్ణ‌.. ఇటీవ‌ల చేసిన హింసాత్మ‌క ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌ కు పంప‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మందకృష్ణ‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌నే డిమాండ్‌ తో ఆ సంఘం జాతీయ క‌మిటీ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది.

ఈ రోజు (ఆదివారం) నుంచి 26 వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండ‌ల‌.. జిల్లా కేంద్రాల్లో అఖిల‌ప‌క్ష స‌మావేశాలు.. అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని.. అప్ప‌టికి రాష్ట్ర స‌ర్కారు స్పందించ‌కుంటే 27న రాష్ట్ర బంద్ నిర్వ‌హిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

మొన్నామ‌ధ్య ట్యాంక్ బండ్ మీద త‌మ ఆందోళ‌న‌ల‌తో అర్థ‌రాత్రి వేళ క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో.. మంద‌కృష్ణ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ మీద చంచ‌ల‌గూడ జైలుకు పంపారు. దీంతో ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు విపక్షాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ఆయ‌న్ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ప‌లు చోట్ల ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. న‌ల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంటిని ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు. జ‌న‌గామ జిల్లాలోనూ ఆందోళ‌న‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.

ఇదిలా ఉంటే.. మంద‌కృష్ణ‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని టీడీపీ పాలిట్ బ్యూరో స‌భ్యులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఆరోపించారు.  కుట్ర‌తోనే మంద‌కృష్ణ‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.
Tags:    

Similar News