మేనకా గాంధీ... ఇందిరా గాంధీ కోడలిగా, దివంగత నేత సంజయ్ గాంధీ సతీమణిగా అందరికీ తెలిసిన వారే. గాంధీ ఫ్యామిలీ ఆది నుంచి కాంగ్రెస్‌ను నడిపిస్తున్నా... మేనకా మాత్రం బీజేపీలో చేరిపోయారు. తన కుమారుడు, యువనేత వరుణ్ గాంధీని కూడా ఆమె బీజేపీలోకే లాక్కొచ్చేశారు. ప్రస్తుత లోక్ సభలో వీరిద్దరూ బీజేపీ ఎంపీలుగానే కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా లోక్ సభలో ఎంపీలుగా ఉన్నారు. మొత్తంగా గాంధీ ఫ్యామిలీకి చెందిన నలుగురు ఎంపీలు సభలో ఉంటే... ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా, మరో ఇద్దరు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. ఇదంతా తెలిసిన విషయమే అయినా... మేనకా గాంధీ ప్రస్తుతం మోదీ కేబినెట్ లో కీలక శాఖ అయిన మహిళా - శిశు సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇంతదాకా బాగానే ఉన్నా... మేనక అంటే జంతు ప్రేమికురాలిగా, ప్రముఖ సంఘ సేవకురాలిగా చాలా నెమ్మదిగానే ఉంటారు. దాదాపుగా మీడియా ముందుకు ఎప్పుడో గానీ రాని మేనక... వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారనే చెప్పాలి. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించే అధికారులపై మాత్రం ఆమె చాలా కఠినంగానే వ్యవహరిస్తారట. ఈ కోవలో ఇప్పటిదాకా ఆమె ఆగ్రహం మనకు తెలియనే లేదని చెప్పాలి. అయితే తాజాగా మేనకా గాంధీ కోపం ఏ రేంజిలో ఉంటుందన్న విషయం వెలుగులోకి వచ్చేసింది. ఓ ప్రభుత్వ అధికారిని ఆమె అందరి ముందే నిలబెట్టి మరీ క్లాస్ పీకారు. పెద్ద స్వరంతో సదరు అధికారిపై గద్దిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయిందని చెప్పక తప్పదు.
ఎప్పుడూ శాంతమూర్తిగానే కనిపించే మేనకా గాంధీ... ఓ అధికారిపై అది కూడా అందరి ముందూ కేకలేస్తూ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ బహేరీలో పీడీఎస్ స్కీమ్ ను పరిశీలించడానికి వెళ్లిన్నప్పుడు మేనకా ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సందర్భంగా మేనకాగాంధీ సదరు అధికారిని విపరీత వ్యాఖ్యలతో దూషించారు. అందరి ముందే పరుష పదజాలంతో చివాట్లు పెట్టారు. ఆ అధికారి అవినీతి పాల్పడుతున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనకా గాంధీ ఈ విధంగా స్పందించారు. మేనకా నోట ఈ స్థాయిలో దూషణలు రావడం సదరు అధికారిపై ఫిర్యాదు చేసిన ప్రజలను షాక్ కు గురి చేసిందట.