‘మేనక’ పేరు ఎత్తితేనే ఆ రాష్ట్రం ఫైర్ అవుతోంది

Update: 2016-10-27 10:31 GMT
జంతు ప్రేమికురాలు.. కేంద్రమంత్రి మేనకాగాంధీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జంతువుల క్షేమం గురించి తరచూ మాట్లాడటం.. వాటి కోసం పోరాడే ఆమెపై కేరళలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఒక వీధి కుక్కలు 90 ఏళ్ల వృద్ధురాలిని పీక్కుతిన్నాయి. ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో.. వీధికుక్కలు కనిపిస్తే చాలు.. కేరళీయులు వాటిని చంపేస్తున్నారు.

ఇక.. యువజన కాంగ్రెస్ నేతల జోరు అయితే మరింత పెరిగింది. పెద్ద సంఖ్యలో వీధికుక్కల్ని చంపేసి.. వాటిని ప్రదర్శనగా తీసుకెళ్లటం వార్తల్లో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ఇలాంటి ఘటనలు కేంద్రమంత్రి కమ్ జంతు ప్రేమికురాలైన మేనకను తీవ్రంగా కలిచివేశాయి. వెంటనే స్పందించిన ఆమె.. వీధి కుక్కల్ని చంపిన వారిపై అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించాలని డిమాండ్ చేస్తుననారు.

అంతేకాదు.. మూగజీవాల్ని చంపటానికి ఉసిగొల్పిన వారికి మరణశిక్ష విధించాలంటూ తీవ్రమైన వ్యాఖ్యనే చేశారు. దీనిపై రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇక.. కేరళ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల అయితే.. మేనకాగాంధీని మోసకారిగా అభివర్ణించారు. తమ ముఖ్యమంత్రిని కూడా ఆమె లెక్క చేయటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేరళలోని వీధి కుక్కల్ని చంపొద్దని చెప్పటానికి మేనక ఎవరని ప్రశ్నిస్తున్నారు. విషయం ఎంతవరకు వెళ్లిందంటే.. మేనక చేస్తున్న వ్యాఖ్యలపై కేరళ అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగటమే కాదు.. ఆమె వ్యాఖ్యల్ని అధికార.. విపక్ష నేతలు మూకుమ్మడిగా ఖండించారు. ఇలాంటి పరిస్థితి మేనకకు ఎప్పుడూ ఎదురై ఉండదు. మూగజీవాలపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు. కానీ.. వెనుకా ముందు.. సమయం సందర్భం చూసుకోవాలన్న విషయాన్ని ఆమె మర్చిపోవటమే అసలు ఇబ్బందిగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News