కేంద్రమంత్రుల కోట్లాట వెనుక హైదరాబాదీ వేటగాడు

Update: 2016-06-11 05:11 GMT
ఒకే పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కేంద్రమంత్రుల మధ్య గొడవకు ఒక హైదరాబాదీ వేటగాడు కారణం కావటం విశేషం. ఇంతకీ ఆ ఇద్దరు కేంద్రమంత్రులు ఎవరు? వారెందుకు గొడవ పడుతున్నారు? వారి గొడవకు హైదరాబాదీ వేటగాడికి సంబంధం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.

బీహార్ లోని మకామా ప్రాంతంలో బ్లూబుల్స్ స్వైర విహారం చేస్తున్నాయి. వీటి దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో.. వారంతా తమకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో బీహార్ రాష్ట్ర అటవీ శాఖాధికారులు కలిసి బ్లూబుల్స్ కారణంగా రైతులకు జరుగుతున్న నష్టాన్ని పరిశీలించారు. చివరకు వాటిని కాల్చిచంపటం మినహా మరో మార్గం లేదని తేల్చారు. మరి.. ఇలాంటి వాటిని వేటాడే మొనగాడు వేటగాడు ఎవరని చూస్తే.. అందరి వేళ్లు హైదరాబాద్ కు చెందిన షఫత్ అలీఖాన్ కనిపించాడు.

ఈ వేటగాడు మామూలోడు కాదు. వారి కుటుంబం మూడు తరాల నుంచి వేటగాడి వృత్తినే నమ్ముకుంది. ఇక.. అలీఖాన్ విషయానికే వస్తే.. ప్రభుత్వాలు కోరిన మీదట ప్రజల ప్రాణాలు తీసే క్రూర మృగాల్ని తనదైన శైలిలో వేటాడి హతమారుస్తుంటారు. కర్ణాటకలని మైసూర్ సమీపంలోని హెచ్ డీ కోటలో 19 మందిని పొట్టన బెట్టుకున్న ఏనుగుల్ని అలీ హతమార్చారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగులు.. మూడు పులులు.. పన్నెండు చిరుతల్ని హతమార్చారు. బీహార్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మీదట వేల సంఖ్యలో అడవి పందులు.. వందలాది అడవి కుక్కల్ని హతమార్చారు. క్రూర జంతువులను హతమార్చటమే కాదు.. వాటిని సంరక్షించే విలక్షణత్వం అలీ సొంతం.

ప్రజల ప్రాణాలు తీసే జంతువుల్ని హతమార్చే ఇతగాడు.. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు (బీహార్.. మధ్యప్రదేశ్.. జార్ఖండ్.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్) అటవీ విభాగం సలహాదారుగా పని చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వం కోరిన మీదట రైతులకు నష్టం చేస్తున్న బ్లూబుల్స్ ను నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 300 బ్లూబుల్స్ ను చంపేశాడు.

దీన్ని కేంద్రమంత్రి.. జంతు ప్రేమికురాలు మేనకాగాంధీ తీవ్రంగా తప్పు పడుతుంటే.. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న జంతువుల్ని చంపితే ఎలాంటి తప్పు లేదంటూ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వాదిస్తున్నారు. ఇదే వీరిద్దరి మధ్య మాటల యుద్ధంలా మార్చింది. జంతువుల్ని ప్రేమించటం తప్పు కాదు. కానీ.. ఆ పేరు చెప్పి అవేం చేస్తున్నా.. గుడ్లు అప్పగించి చూడాలే తప్పించి.. ఏమీ చేయకూడదన్న మూర్ఖపు ఆలోచన మంచిది కాదన్న విషయాన్ని మేనకా గాంధీ లాంటి వారు ఎప్పటికి అర్థం చేసుకుంటారో..?
Tags:    

Similar News