మంగళగిరి మ్యాటర్ : లోకేష్ పోటీ డౌట్లో పడిందా...?

Update: 2022-08-11 08:43 GMT
తెలుగుదేశం పార్టీ భావి వారసుడు, యువ నేత నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ఇప్పటిదాకా వినిపించిన మాట. అయితే మంగళగిరిలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అదే టైమ్ లో ఈసారి లోకేష్ ఎక్కడ పోటీ చేసినా కచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిచి తీరాలని కూడా భావిస్తోంది.

ఏ మాత్రం చిన్నపాటి డౌట్ ఉన్నా కూడా ఇక అక్కడ వద్దే  వద్దు అని కూడా అనుకుంటోంది. ఇదిలా ఉంటే మంగళగిరిలో బలమైన సామాజికవర్గంగా చేనేత కులస్తులు ఉన్నారు. మొత్తం రెండులక్షలు దాటిన ఓట్లలో అత్యధిక శాతం వారి ఓట్లే ఉన్నాయి. ఆ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ ఓట్లతోనే ఓడిన గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేయడం అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

దీని వల్ల భారీ ఎత్తున ఉన్న చేనేత సామాజికవర్గానికి చెడు సంకేతం పార్టీ ద్వారా పోతుంది అని అంటున్నారు. ఇక నారా లోకేష్ ఈసారి గెలుపు ఖాయమని బరిలోకి దిగుతున్న వేళ గంజి చిరంజీవి కనుక వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి వస్తే ఇబ్బందే అని కూడా అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కచ్చితంగా మంగళగిరి నుంచే పోటీ చేసి ఈసారి బంపర్ విక్టరీ కొడతాను అని ఇప్పటిదాకా చాలెంజి చేస్తూ వస్తున్న లోకేష్ బాబు తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ తనకు కూడా టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబే అని తేల్చేశారు.

తాను మంగళగిరిలో పోటీ చేయాలని అనుకుంటున్నాను అని, అయితే తన అభ్యర్ధిత్వం మీద కూడా సర్వే చేసిన మీదటనే టికెట్ ఇస్తారని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిజానికి లోకేష్ అనుకుంటే ఎక్కడ అయినా సీటు వస్తుంది. ఆయన చంద్రబాబు వారసుడు. ఆయన విషయంలో సర్వే సాకులు ఎవరు చెబుతారు ఎందుకు చెబుతారు. పైగా ఇప్పటిదాకా ఆ మాట మాట్లాడని లోకేష్ ఇపుడు ఇలా అనడమేంటి అన్న డౌట్లు వస్తున్నాయి.

మంగళగిరిలో గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసిన రోజే ల్యాండ్ అని లోకేష్ తాజా రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకునే ఇలా మాట్లాడి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. గతంలో మాదిరిగా ఆయన ఇక్కడ నుంచే పోటీకి దిగుతాను అని గట్టిగా చెప్పలేకపోవడం మీద కూడా చర్చ సాగుతోంది. అంటే లోకేష్ మంగళగిరి నుంచి నిజంగా బరిలోకి దిగుతారా లేక ఆయన వేరే ఆలోచనలో ఉన్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఏది ఏమైనా నారా లోకేష్ పోటీ చేస్తే కనుక గంజి చిరంజీవినే వైసీపీ తమ అభ్యర్ధిగా పోటీకి పెట్టాలని భావిస్తోంది అంటున్నారు. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డికి ఈసారి టికెట్ దక్కదని చెబుతున్నారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు అయినా కూడా బీసీ కార్డు ఉపయోగించి లోకేష్ కి చెక్ చెప్పాలన్న వ్యూహంతోనే వైసీపీ సాగుతుంది అంటున్నారు. మొత్తానికి మంగళగిరిలో రానున్న రోజులలో పరిణామాలు శరవేగంగా మారుతాయని అంటున్నారు.
Tags:    

Similar News