మంగ‌ళ‌గిరి బ‌రిలో లోకేశ్!... వ‌ర్క‌వుట‌వుతుందా?

Update: 2019-02-27 06:34 GMT
మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అన్ని పార్టీలు త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈ తర‌హా వ్యూహాల్లో విప‌క్ష వైసీపీ త‌న‌దైన స్పీడును చూపిస్తోంటే... అధికార టీడీపీ మాత్రం ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెన‌క్కు అన్న చందంగా సాగుతోంది. ఇప్ప‌టిదాకా రాష్ట్రంలోని స‌గానికి పైగా సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశామంటూ లీకులు ఇస్తున్న టీడీపీ... వాటిపై అధికార ప్ర‌క‌ట‌న మాత్రం చేయ‌డం లేదు. దీనిని బ‌ట్టి... చివ‌రి నిమిషం వ‌ర‌కు అభ్య‌ర్థుల ఖ‌రారు కొన‌సాగుతూనే ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీలో మిగిలిన నేత‌లంద‌రినీ వ‌దిలేస్తే... పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రిగానే కాకుండా చంద్ర‌బాబు త‌ర్వాత రాష్ట్రానికి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్న నారా లోకేశ్ భ‌విష్య‌త్తు ఏమిట‌న్న విష‌యంపైనా ఆ పార్టీ ఇప్ప‌టిదాకా ఓ నిర్ణ‌య‌మే తీసుకోలేక‌పోయింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన లోకేశ్‌... రెండేళ్ల క్రితం దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప్ర‌వేశించ‌డంతో పాటుగా కేబినెట్ లోనూ చోటు ద‌క్కించుకున్నారు. అయితే ఓ జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ అధినేత కుమారుడిగా లోకేశ్... ఈ ద‌ఫా మాత్రం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌దు.

దిగ‌కున్నా న‌ష్ట‌మేమీ లేదు గానీ... పార్టీ శ్రేణుల దృష్టిలో చుల‌క‌న అయిపోతారు. సో... చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీపై ప‌ట్టు సాధించాలంటే.. ఈ ఎన్నిక‌ల్లో లోకేశ్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో లోకేశ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యంపై టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త లీకులు ఇస్తూ... ఆస‌క్తిక‌ర చర్చ‌ల‌కు తెర తీస్తోంది. సొంత జిల్లా చిత్తూరులోని త‌మ సొంతూరు నారావారిప‌ల్లె ఉన్న చంద్ర‌గిరి నియోజవ‌ర్గం నుంచి లోకేశ్ పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా... ఎందుక‌నో ఆ దిశ‌గా చంద్ర‌బాబు దృష్టి సారించ‌డం లేదు. ఇత‌ర జిల్లాలు, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల వైపే దృష్టి సారిస్తున్న చంద్ర‌బాబు... ఇప్పుడు కొత్గా మ‌రో లీకు ఇచ్చేశారు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి కేంద్రంగా ఉన్న మంగ‌ళ‌గిరి స్థానం నుంచి లోకేశ్ ను బ‌రిలోకి దించితే ఎలా ఉంటుందన్న‌ది ఈ లీక్ సారాంశంగా క‌నిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగి ఓట‌మిపాలైన గంజి చిరంజీవి ఈ ద‌ఫా కూడా టికెట్ ఆశిస్తున్నారు.

అయితే చిరంజీవికి టికెట్ ఇస్తే... తాము స‌హ‌క‌రించ‌మ‌ని అక్క‌డి స్థానికి త‌మ్ముళ్లు చెబుతున్నార‌ట‌. టీడీపీకి మంచి ప‌ట్టున్న ఈ స్థానంలో స‌రైన నేత లేని కార‌ణంగానే గ‌తంలో ఓడామ‌ని, ఈ సారి లోకేశ్ లాంటి అభ్య‌ర్థి రంగంలోకి దిగితే విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కేన‌ని, ఇక్క‌డ టీడీపీ గెలుపు చాలా ముఖ్య‌మ‌న్న వాద‌నను కూడా విడుద‌ల చేశారు. రాజ‌ధాని ప్రాంతంలోని అసెంబ్లీ సీటును ద‌క్కించుకోవ‌డం ద్వారా రాజ‌ధాని ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌పై మ‌రింత మేర ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తంగా మంగ‌ళ‌గిరిలో ఈ ద‌ఫా లోకేశ్ బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని తెలుసుకునే య‌త్నంలో భాగంగానే ఈ లీక్ వ‌దిలినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం టీడీపీ నేత‌లంతా కూడా రౌండ‌ప్ చేసినా... సింగిల్ అంగుళం కూడా వెన‌క్కు త‌గ్గ‌కుండా అధికార పార్టీ దురాగ‌తాల మీద వీరోచితంగా పోరాడుతున్న ఆర్కే మీద లోకేశ్ విజ‌యం సాధించ‌డం అంత ఈజీ కాద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి మంగ‌ళ‌గిరి బ‌రి నుంచి లోకేశ్ పోటీపై చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News