అయ్య‌ర్ మాట‌ల‌తో కాంగ్రెస్ స‌ర్వ‌నాశ‌నం!

Update: 2018-02-14 04:48 GMT
నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట మాట్లాడేయ‌టం.. ప‌రిమితుల్ని.. ప‌రిధుల్ని తోసి రాజ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. దేశాన్ని అవ‌మానించేలా.. చుల‌క‌న చేసేలా మాట్లాడ‌టం ఈ మ‌ధ్య‌న ఫ్యాష‌న్ అయిపోయింది. ఈ దేశంలో ఉన్న స్వేచ్చ‌ను నాయ‌కులు కొంద‌రు ఎంత దారుణంగా వినియోగిస్తున్నారో ఈ మ‌ధ్య‌న చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల కాశ్మీరీ ఎమ్మెల్యే ఒక‌డు నిండు అసెంబ్లీలో పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి సంచ‌ల‌నం సృష్టించాడు.

తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ దారుణ వ్యాఖ్య‌లు చేశారు. పాక్ లో జ‌రుగుతున్న క‌రాచీ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్ కు హాజ‌రైన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాక్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని.. పాక్ లోనే త‌న‌కు ఎక్కువ ప్రేమ ల‌భిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. పాక్ మీద ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అదే స‌మ‌యంలో భార‌త్ ను చుల‌క‌న చేసేలా.. త‌క్కువ చేసేలా వ్యాఖ్య‌లు చేయ‌టంపైన పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త్ లో అంతా విద్వేష‌మేన‌ని వ్యాఖ్యానించారు. పాక్ లో త‌న‌కు వేలాది మంది స్వాగ‌తం ప‌లుకుతున్నార‌ని.. వారెవ‌రో త‌న‌కు తెలీద‌ని.. అయినా వ‌చ్చి కౌగిలించుకుంటున్నార‌ని.. పాక్ కు రావ‌టం సంతోషంగా ఉంద‌న్నారు.

ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి.. ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడ‌టం మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌కు కొత్తేం కాదు. ఇంత‌దాకా ఎందుకు 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన‌కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా ఇదే మ‌ణిశంక‌ర్ బ‌లుపుతో చేసిన వ్యాఖ్య‌లు మోడీ మీద సానుభూతిగా మార‌టం.. ఆయ‌న‌కు భారీగా మేలు చేయ‌టంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర న‌ష్టాన్ని వాటిల్లేలా చేయ‌టం తెలిసిందే.

త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ తాజాగా మ‌రిన్ని మంట పుట్టే వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌.. పాక్ దేశాలు రెండు నిరంత‌రాయంగా చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని.. ద్వైపాక్షిక అంశాల ప‌రిష్కారానికి చ‌ర్చ‌లే మార్గంగా పాక్ అంగీక‌రించింద‌ని..కానీ భార‌త్ మాత్రం సుముఖంగా లేర‌ని వ్యాఖ్యానించారు.

భార‌త్ త‌న‌ను తాను ప్రేమించిన‌ట్లే పొరుగువాడిని కూడా ప్రేమించాల‌న్నారు. తాను మాత్రం భార‌త్‌ ను ప్రేమించిన‌ట్లే పాక్ ను ప్రేమిస్తున్న‌ట్లుగా చెప్పారు. ఓ ప‌క్క దేశ స‌రిహ‌ద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు భార‌త సైన్యం మీద దాడులు చేస్తూ.. ప్రాణాలు తీస్తున్న వేళ‌.. అయ్య‌ర్ మాత్రం క‌రాచీ వెళ్లి భార‌త్ కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌టంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.  

మ‌ణిశంక‌ర్ మాట‌లు మిగిలిన వాళ్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సొంత పార్టీ నేత‌లు సైతం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత విహెచ్ హ‌నుమంత‌రావు స్పందిస్తూ.. ఆయ‌న త‌న నోటిని అదుపులో ఉంచుకోవాల‌న్నారు. ఆయ‌న్ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేయాల‌ని.. పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.

త‌న బ‌లుపు మాట‌ల‌తో ఇప్ప‌టికే పార్టీకి భారీ న‌ష్టాన్ని క‌లిగించిన అయ్య‌ర్ ను కాంగ్రెస్ పార్టీ ఇంకా కంటిన్యూ చేస్తే.. ఆ పార్టీ స‌ర్వ‌నాశ‌నం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌తో మోడీకి భారీ మేలు చేసిన ఆయ‌న‌.. భాద్య‌తారాహిత్యంతో తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా భార‌త్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి నేత‌ల పౌర‌స‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసేసి.. పాక్ లో ఉంచేస్తే కానీ దాయాది దేశం ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News