దిసీజ్ మోదీ మేడ్ క్రైసిస్: మన్మోహన్ సింగ్

Update: 2019-09-02 08:23 GMT
దేశ ఆర్థికవ్యవస్థ తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆందోళనకరంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అప్రమత్తం చేశారు.  కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని - ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించే పని చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు చేరడానికి మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విరుచుకుపడ్డారు. అన్నిరంగాల వైఫల్యానికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

ఇవన్నీ మోదీ చేసిన తప్పులు దేశ ఆర్థికవ్యవస్థ సుదీర్ఘ మందగమనంలో చిక్కుకుందని.. సాధారణ జీడీపీ వృద్ధిరేటు 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని.. మోదీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అన్ని రకాలుగా భ్రష్టుపట్టించటమే దీనికి కారణమని మన్మోహన్‌ సింగ్ విమర్శించారు. మన్మోహన్ దేశ ఆర్థికవ్యవస్థ స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేసిన వీడియో సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. పెద్ద నోట్లు రద్దు చేయటం - హడావుడిగా జీఎస్‌ టీ అమలు చేయటం వంటి మానవ కల్పిత మహా తప్పిదాల నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని తేటతెల్లమవుతుందన్నారాయన. మోదీ ప్రభుత్వ విధానాలు ఉద్యోగాలు లేని వృద్ధికి దారితీస్తున్నాయని.. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.50 లక్షల ఉద్యోగాలు పోయాయని ఆయన ప్రస్తావించారు.

ద్రవ్యోల్బణం తగ్గిందని సరదా పడొద్దు.. రైతుల ఆదాయం పోయింది మోదీ ప్రభుత్వం గొప్పగా చూపుతున్న తక్కువ ద్రవ్యోల్బణ రేటు.. రైతుల ఆదాయాలను పణంగా పెట్టి సాధించినదని తప్పుపట్టారు. ఈ ఆర్థిక వ్యవస్థ మందగమనం మానవ కల్పిత సంక్షోభమని అభివర్ణించారు. దీని నుంచి దేశాన్ని గట్టెక్కించటం కోసం.. ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను పక్కనపెట్టి - వివేకవంతులు - ఆలోచనాపరులు అందరినీ సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు.

మన్మోహన్ ప్రసంగం పూర్తి పాఠమిదీ..''నేటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. గత త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 5 శాతంగా ఉండటం.. మనం సుదీర్ఘ ఆర్ధిక మందగమనంలో చిక్కుకున్నామని సంకేతాలిస్తోంది.

అంతకన్నా వేగవంతమైన రేటుతో వృద్ధి చెందగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. కానీ మోదీ ప్రభుత్వం అన్నిరకాలుగా భ్రష్టుపట్టించటం ఈ మందగమనానకి దారితీసింది.

ప్రత్యేకించి తయారీ రంగ వృద్ధి 0.6 శాతం దగ్గర కుంటుతూ ఉండటం నిస్పృహ కలిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేయటం - హడావుడిగా జీఎస్‌ టీ అమలు చేయటం వంటి మానవ కల్పిత మహా తప్పిదాల నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని ఇది తేటతెల్లం చేస్తోంది.

దేశీయ డిమాండ్ కుంగిపోయింది. వినియోగ వృద్ధి 18 నెలల కాలంలో అతి తక్కువగా ఉంది. సాధారణ జీడీపీ వృద్ధి 15 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది.

పన్ను ఆదాయాల్లో భారీ కొరత పడింది. ఒకవైపు చిన్న - పెద్ద వ్యాపారులందరినీ వేటాడుతుండటం.. పన్ను ఉగ్రవాదం అప్రతిహతంగా కొనసాగుతుండటంతో దీనికి తెరిపి కనిపించటం లేదు. పెట్టుబడిదారుల సెంటిమెంట్లు నిరుత్సాహంగా ఉన్నాయి. ఆర్థికవ్యవస్థ కోలుకోవటానికి ఇవి పునాదులు కావు.

మోదీ ప్రభుత్వ విధానాలు.. ఉద్యోగాలు లేని వృద్ధికి దారితీస్తున్నాయి. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.50 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇదేతరహాలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయి. అది మన దుర్బల కార్మికులను దెబ్బతీస్తుంది.

గ్రామీణ భారతం పరిస్థితి దారుణంగా ఉంది. రైతులకు తగిన ధరలు అందటం లేదు. గ్రామీణ ఆదాయాలు పతనమయ్యాయి. మోదీ ప్రభుత్వం గొప్పగా చూపుతున్న తక్కువ ద్రవ్యోల్బణ రేటు.. మన రైతులు - వారి ఆదాయాలను పణంగా పెట్టగా.. భారతదేశంలో 50 శాతం మందికి పైగా జనాభాను దైన్యంలోకి నెట్టగా వచ్చింది.

సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి. వాటి స్వయంప్రతిపత్తిని హరిస్తున్నారు. రికార్డు స్థాయిలో 1.76 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసిన ఆర్‌బీఐ ఎలా నిలబడుతుందో చూడాలి. మరోవైపు.. ఆకస్మికంగా లభించిన ఈ నగదును ఏం చేయాలనే దానిపై తమ దగ్గర ప్రణాళిక లేదని ప్రభుత్వం చెప్తోంది.

దీనికితోడు.. ఈ ప్రభుత్వ హయాంలో భారతదేశ గణాంకాల విశ్వసనీయత మీద ప్రశ్నలు తలెత్తాయి. బడ్జెట్ ప్రకటనలు, కోతలు.. అంతర్జాతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని సడలించాయి. భౌగోళిక రాజకీయ పున:సమీకరణాలతో ప్రపంచ వాణిజ్యంలో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవటానికి భారతదేశం తన ఎగుమతులను పెంచలేకపోయింది. మోదీ ప్రభుత్వం కింద ఆర్థిక నిర్వహణ పరిస్థితి ఇలా ఉంది.

మన యువత - రైతులు - వ్యవసాయ కూలీలు - పారిశ్రామికవేత్తలు - అణగారిన వర్గాలకు మేలు జరగాల్సి ఉంది. భారతదేశం ఈ మార్గంలో దిగజారటం కొనసాగించజాలదు. కాబట్టి.. ఈ మానవ నిర్మిత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించటం కోసం.. కక్షసాధింపు రాజకీయాలను పక్కనపెట్టి - వివేకవంతులు - ఆలోచనాపరులు అందరినీ సంప్రదించాలని ఈ ప్రభుత్వానికి నేను విజ్ఙప్తి చేస్తున్నాను.''


Tags:    

Similar News