అనాల్సింది అనేసి ఇప్పుడు తిట్టేస్తున్నాడు

Update: 2015-10-16 13:07 GMT
నేతల మాటలు నీటి మూటలని ఊరికే అనలేదు. తమకు తోచింది చెప్పేయటం.. ఆ తర్వాత ఆ మాటలు వివాదాస్పదంగా మారితే.. దాన్ని తిప్పేయటం అలవాటే. సరిగ్గా అలాంటి వ్యవహారమే మరోమారు చోటు చేసుకుంది. తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో ‘‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.

ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ.. భారత్ లో ముస్లింలు ఉండొచ్చు కానీ.. వారు గోమాంసం తినటం మానేయాలని.. ఎందుకంటే గోవును దైవంగా పూజించే వారి మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించకూడదంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపటంతో పాటు.. రాజకీయ పార్టీలు విరుచుకు పడ్డాయి.

తాను చేసిన వ్యాఖ్యల మంటలు పుట్టిస్తున్న నేపథ్యంలో.. నష్ట నివారణకు ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. పత్రికలో వచ్చినట్లుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయలేదని.. ఆయన మాటల్ని వక్రీకరించారని పేర్కొంది. తన మాటల్ని తప్పుదారి పట్టించారని.. తన మాటల కారణంగా ఎవరైనా మనోభాలు దెబ్బ తింటే చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజంగా అంత బాధే ఉంటే.. మాట్లాడేటప్పుడు నాలుకను కాస్త అదుపులో ఉంచుకొంటే ఈ సమస్యలన్నీ వచ్చేవి కావు కదా..?

Tags:    

Similar News