మిమ్మ‌ల్ని మ‌ర్చిపోలేం..మీకు స‌రిరారెవ్వ‌రు పారిక‌ర్ సాబ్‌

Update: 2019-03-19 04:46 GMT
గోవా ముఖ్య‌మంత్రి.. మాజీ కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ మ‌ర‌ణం యావ‌త్ దేశాన్ని శోక‌సంద్రంలో మునిగిపోయేలా చేసింది. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న గురుతుల‌తో గ‌డిచిన రెండు రోజులుగా త‌లుచుకోవటం.. అలాంటి నాయ‌కుడ్ని ఈ దేశం మ‌ళ్లీ చూస్తుందా? అన్న ప్ర‌శ్న‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒక నాయ‌కుడికి ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాల‌న్న దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మ‌నోహ‌ర్ పారిక‌ర్ ను చెప్పొచ్చు.

అస‌మాన్యుడే అయిన‌ప్ప‌టికి సామాన్యుడిగా వ్య‌వ‌హ‌రించ‌టం.. త‌న‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌త అక్క‌ర్లేద‌న్నట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూ స్కూట‌ర్ మీద ప్ర‌యాణించే ఏకైక నేత‌గా పారిక‌ర్ ను చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. దేశ‌భ‌క్తికి ప్ర‌తిరూపంగా చెప్పే మ‌నోహ‌ర్ పారిక‌ర్ జ్ఞాపకాల్ని దేశ ప్ర‌జ‌లు  ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గొప్ప‌త‌నం గురించి మ‌రోసారి ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌కీయాల్లోకి రాక మునుపు పారిక‌ర్ ఐఐటీలో చ‌దువుకున్నారు. తాజాగా ఆయ‌న మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న జ్ఞాపకాల్ని ప‌లువురు ఐఐటీయ‌న్లు గురుతు చేసుకున్నారు. ఆయ‌న‌తో చ‌దువుకున్న వారు.. ఆయ‌న రూమ్మేట్స్ త‌మ‌కు పారిక‌ర్ తో ఉన్న‌ జ్ఞాపకాల్ని చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. తాను చ‌దివిన ఐఐటీ ముంబ‌యిని పారిక‌ర్ మ‌ర్చిపోయేవారు కాద‌ని.. యూనివ‌ర్సిటీ పూర్వ విద్యార్థిగా ఆయ‌న ఎంత‌టి బిజీ షెడ్యూల్ లోనూ వ‌ర్సిటీ ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మానికి వ‌చ్చేవార‌న్న విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. చ‌దువులో టాప్ గా నిలుస్తూనే.. ఇత‌ర యాక్టివిటీస్ లోనూ చురుగ్గా ఉండేవారు. ఐఐటీలో విద్యార్థిగా ఉన్న వేళ‌లోనే పారిక‌ర్ రాజ‌కీయ నేత‌గా ఎదుగుతార‌న్న అంచ‌నా ఉండేది. అందుకు త‌గ్గ‌ట్లే పారిక‌ర్ ఉన్నార‌ని చెప్పారు.

తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వారు  తెలియ‌జేశారు. ఆ విష‌యాన్ని వారి మాట‌ల్లోనే చెప్పుకుంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. వారి మాట‌ల్లోనే పారిక‌ర్ గొప్ప‌త‌నాన్ని చ‌దివితే..

+  ‘అప్పుడు మా హాస్టల్‌ ఫీజు నెలకు రూ.180గా ఉండేది. ఈ మొత్తాన్ని కట్టడానికి మేమంతా ఇబ్బంది పడేవాళ్లం. మెస్‌ కాంట్రాక్టర్‌ సలహాతో పారికర్‌ తనే స్వయంగా నగరంలోని బైకుల్లా బజార్‌కు వెళ్లి కూరగాయలు కొనేవాడు. దీంతో మా ఫీజు రూ.160కి తగ్గింది’

+  పూర్వ విద్యార్థుల సమావేశం జరిగిన ప్రతిసారి సభ్యులందరికీ ఒక భోజన కూపన్‌ ఇచ్చేవారు. పారికర్‌ అతని హోదాను పక్కన పెట్టి మా అందరితో పాటే క్యూలో నిల్చొనే భోజనం చేసేవారు. స్నేహితులతో ఉన్నప్పడు సెక్యూరిటీ సిబ్బందిని దూరంగానే ఉండమని చెప్పేవారు. 

+  ‘1978లో ఓసారి మా హాస్టల్‌ మెస్‌ సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. వారితో సన్నిహితంగా ఉండే పారికర్‌ వారిని విధుల్లోకి రమ్మని అడగ్గా వారు తిరస్కరించారు. దీంతో విద్యార్థులందరికీ వండి పెట్టేందుకు మాలోనే 40 మంది విద్యార్థులను ఒప్పించాడు. మా జీవితంలో అలాంటి వంటలు ఇంకెప్పడూ తినలేదు’

+  ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆటోలోనే విమానాశ్రయానికి వెళ్లిన సాధారణ మనిషి పారికర్‌.   ‘పారికర్‌ మృతి మమ్మల్నందర్నీ షాక్‌ కు గురి చేసింది. అతను ఐఐటీ(బి) విశిష్ట విద్యార్థి. విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎన్నో కీలక కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములయ్యారు.’


Tags:    

Similar News