ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్య‌మంత్రి

Update: 2017-08-28 06:25 GMT
దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉద‌యం ఉప ఎన్నిక‌లు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. గోవాలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఘ‌న విజ‌యాన్ని సాధించారు. గోవా రాష్ట్ర రాజ‌ధాని ప‌నాజీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో 4803 ఓట్ల మెజార్టీతో ఆయ‌న విజ‌యం సాధించారు.

కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోహ‌ర్ పారీక‌ర్‌.. ఈ మ‌ధ్య‌న గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం ప‌ద‌విని చేప‌ట్టారు. అసెంబ్లీ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ మెజార్టీ రాక‌పోవ‌టం.. అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ల మంత్రాంగం పుణ్య‌మా అని కేంద్ర‌మంత్రిగా ఉన్న మ‌నోహ‌ర్ పారీక‌ర్ కానీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే తాము బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చిన్నా చిత‌కా పార్టీలు చెప్ప‌టంతో అప్ప‌టిక‌ప్పుడు పారీక‌ర్ ను ఢిల్లీ నుంచి గోవాకు పంపారు.

దీంతో గోవా ముఖ్య‌మంత్రిగా మ‌నోహ‌ర్ పారీక‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌నోహ‌ర్ పారీక‌ర్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వ‌చ్చింది. దీంతో.. ఉప ఎన్నిక అనివార్య‌మైంది. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మ‌నోహ‌ర్ పారీక‌ర్ ఘ‌న విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరీశ్ ర‌య చోంద‌క‌ర్ పై ఆయ‌న విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన నేప‌థ్యంలో వ‌చ్చే వారం త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.  మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వాల్పోయిలో బీజేపీ అభ్య‌ర్థి విశ్వ‌జిత్ రానే అధిక్యంలో కొన‌సాగుతున్నారు.
Tags:    

Similar News