హడావుడి చేయొద్దంటూనే బ్యాక్ ఎండ్ లో అంత కసరత్తు

Update: 2022-08-10 05:52 GMT
ఉప ఎన్నికలతో రాజకీయాన్ని మార్చేసి.. తనకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకున్న పార్టీగా సుపరిచితమైన టీఆర్ఎస్ కు ఇప్పుడు అదే ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారటం కాలవైచిత్రి కాక మరేంటి? తనకు సంబంధం లేని సీటును తన సొంతం చేసుకోవటం ద్వారా.. పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లే అరుదైన అవకాశం ఇప్పుడు గులాబీ పార్టీకి ఉంది. ఇటీవల కాలంలో దూకుడు పెంచి..దూసుకెళుతున్న కమలనాథులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్నా.. వారిది బలుపు కాదు వాపు మాత్రమే తేల్చాలన్నా మునుగోడు ఉప ఎన్నికల్లో తన సత్తా చాటాల్సిన అవసరం గులాబీ పార్టీ మీద పడింది.

ఎప్పటిలా ఉప ఎన్నిక అన్నంతనే రాజకీయ హడావుడి మొదలు పెట్టేసి.. చేతిలో ఉన్న అధికారాన్ని విపరీతంగా వాడేయటం ద్వారా పక్కాగా గెలుస్తామన్న రోటీన్ రొడ్డుకొట్టుడు విధానానికి భిన్నంగా వ్యవహరిస్తోంది టీఆర్ఎస్. ఇటీవల కాలంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మునుగోడు విషయంలో చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనది.. హడావుడి చేయొద్దు అంటూ ఇచ్చిన కమాండ్.. టీఆర్ఎస్ తీరుకు పూర్తిగా భిన్నమైనదని చెప్పాలి. హడావుడి చేస్తున్న కొద్దీ.. అది ఆత్మవిశ్వాసం గా కాకుండా అహంకారంగా ప్రజలకు వెళుతున్న సందేశాన్ని బ్రేక్ చేయాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది.

అందుకే.. మునుగోడు ఎపిసోడ్ ను ఇప్పటివరకు అనుసరించిన ఎత్తులకు భిన్నంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తెర ముందు హడావుడి వద్దన్న ఆయన.. తెర వెనుక మాత్రం భారీ ఎత్తున కసరత్తు జరుగుతున్న వైనం చూస్తే.. కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే అన్న భావన కలుగక మానదు. మునుగోడు ఉప ఎన్నిక ఖాయమన్న అవగాహన వచ్చిన నాటి నుంచే బ్యాక్ ఎండ్ లో టీఆర్ఎస్ తన పనిని మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాలు.. గ్రామాల వారీగా పార్టీ బలం మీద కన్నేయటమే కాదు..దానికి సంబంధించిన పక్కా డేటాను సేకరిస్తోంది.

తాము ఎన్ని గ్రామాల్ని.. మండలాల్ని ప్రభావితం చేయగలమన్న విషయంతో పాటు.. అలా చేయటానికి అవసరమైన స్థానిక నాయకుల్ని పార్టీలో చేర్చుకోవటం ద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచన చేస్తోంది టీఆర్ఎస్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వైనం తెలిసిందే. అయితే.. రాజగోపాల్  రెడ్డి కి సన్నిహితంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లటానికి ఆసక్తి చూపని వారిని చూసి.. అలాంటి వారిని తమ పార్టీలోకి చేర్చుకునేలా పావులు కదుపుతోంది.

అదే సమయంలో పార్టీకి చెందిన కొందరు జెడ్పీటీసీలు.. ఎంపీపీలు.. ఎంపీటీసీలు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన అధిష్టానం వారిని హైదరాబాద్‌ పిలిపించి బుజ్జగించాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ బాధ్యతను రవీందర్ రావు.. రవీంద్రకుమార్ లకు అప్పజెప్పింది. పార్టీ టికెట్ ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారు ఉన్నప్పటికీ.. ఎవరికి ప్రత్యేకమైన ఫోకస్ ఇవ్వకుండా.. ముందు పార్టీని చక్కదిద్దుకోవటం.. ఆ తర్వాతే అభ్యర్థి ఎవరన్నది ఫైనల్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో గెలిచిన మునుగోడులో 2018లో ఓడటానికి కారణాలేమిటి? ఆ గ్యాప్ ను ఎలా ఫిల్ చేసుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్.. మునుగోడును పైకి సీరియస్ గా తీసుకోవటం లేదంటూనే.. మరింత జాగ్రత్తగా తీసుకున్న వైనం కనిపిస్తోంది. లోప్రొఫైల్ అన్నట్లు వ్యవహరిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులకు అర్థం కాని రీతిలో అడుగులు వేస్తున్నట్లు చెప్పాలి. మరీ.. వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News