మావోయిస్టుల అడ్డాలో బంగారు గనులు...

Update: 2017-09-28 06:03 GMT
చత్తీస్‌ ఘ‌డ్‌ లోని బస్తర్ అంటే పేద గిరిజనుల నేల... ఇంకా చెప్పాలంటే....నక్సలైట్ల ప్రయోగశాల. నిజానికి బస్తర్ అనేది అచ్చంగా బంగారు భూమి అంటున్నారు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్‌ ఐ)కు చెందిన శాస్త్రవేత్తలు. బస్తర్ ప్రాంతంలో విస్తారంగా బంగారు ఖనిజ నిక్షేపాలున్నాయని వారు తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. బస్తర్ పరిధిలోని రాయగఢ్ - జశ్‌ పూర్ జిల్లాల్లో ఏడుచోట్ల హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎన్జీఆర్‌ ఐ శాస్త్రవేత్తల బృందం ఖనిజ పరీక్షలు నిర్వహించింది. ఆ ప్రాంతాల్లోని శిలల్లో ఉండే క్వార్జ్ సల్ఫైడ్ స్ఫటికాల్లో బంగారు రేణువులు కనిపించాయి.

జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్ తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలపై ప్రత్యేకవ్యాసం ప్రచురితమైంది. భూమిలోని అంతర్‌ ప్రవాహాల స్కానింగ్ ద్వారా ఈ సంగతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. భూభౌతిక శాస్త్రం - స్పెక్ట్రోగ్రఫీల మేళవింపుతో జరిపిన ఈ అధ్యయనాల్లో గోల్డ్ సల్ఫైడ్‌ తో సహా పలురకాల ఖనిజాల ఆచూకీ బయటపడింది.   ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ)ని ఉపయోగించి 100-200 మీటర్ల లోతులోని శిలలను ఎన్జీఆర్‌ ఐ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈఆర్టీ అనేది మన మెదడును స్కానింగ్ చేసే యంత్రం లాంటిదే. దీనిని ఉపయోగించి శిలలను స్కాన్ చేస్తే వాటిలోని ఖనిజ లక్షణాలు తెలిసిపోతాయి. ఈ తరహా స్కానింగ్‌ లో బంగారం ఉన్నట్టు బయటపడింది. బురదమట్టిని జల్లించే సంప్రదాయిక పద్ధతిలోనూ బంగారు రేణువులకోసం అన్వేషించారు. బస్తర్‌ లో స్థానికులు ఇప్పటికీ ఈపద్ధతి ద్వారానే బంగారం కోసం అన్వేషిస్తుంటారు. రెండు పద్ధతుల్లోనూ బస్తర్‌ లో బంగారం ఉనికి వెల్లడైంది. నిక్షేపాల పరిమాణంపై తదుపరి అధ్యయనాలు జరుపాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అయితే ఈ ప‌రిణామాన్ని కొన్ని మావోయిస్టు సానుభూతి సంఘాలు త‌ప్పుప‌డుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత ల‌క్ష్యంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం బ‌స్త‌ర్‌ ను కావాల‌నే ఎంచుకుంద‌ని చెప్తున్నారు. అందుకే బంగారం నిల్వలు ఉన్నాయ‌నే ప్ర‌చారాన్ని సృష్టించింద‌ని అంటున్నారు. బంగారం నిల్వ‌ల అన్వేష‌ణ పేరుతో అక్క‌డ ఉన్న ఆదివాసుల‌ను త‌ర‌లించడానికి ఈ కుట్ర అని మండిప‌డుతున్నాయి.
Tags:    

Similar News