ఎన్ కౌంటర్ ఎలా జరిగిందో ఆమె చెప్పింది

Update: 2016-11-03 06:16 GMT
ఆంధ్రా.. ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు భారీగా హతం కావటం తెలిసిందే. ఇక.. మావో అగ్రనేత ఆర్కే ఆచూకీ లభించని నేపథ్యంలో.. సర్వత్రా ఏం జరిగింది? ఎలా జరిగిందన్న అయోమయం వెల్లువెత్తుతున్న వేళ.. ఒక మీడియా సంస్థకు ఏవోసీ మావోయిస్ట్ ప్రతినిధి జగబంధు స్వయంగా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అసలు ఎన్ కౌంటర్ ఎలా జరిగింది? మరణించిన వారు ఎవరు? అంత భారీగా ప్రాణ నష్టం ఎందుకు జరిగింది? పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారా? మావోల స్పందన ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం లభించేలా ఆమె కొన్ని అంశాల్ని వెల్లడించారు.

ఒక మీడియా ప్రతినిధికి స్వయంగా ఫోన్ చేసి వెల్లడించిన వివరాల్ని ఆమె మాటల్లోనే చూస్తే..

‘‘పోలీసులు చెబుతున్న దాడికి.. నిజంగా జరిగిన దానికి సంబంధమే లేదు. ఈ ఘటనపై వాస్తవాలు చెప్పాల్సిన ఉన్నా.. మా వైపు నుంచి ఆలస్యం జరిగింది.ఆంధ్రా.. ఒడిశా రాష్ట్రాల నాయకత్వం నిర్ణయం మేరకు రామ్ గఢ్ దరి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్లీనరీ లాంటిదేమీ లేదు. అక్టోబరు 23 ఉదయమే మేం రామ్ గఢ్ ప్రాంతానికి చేరుకున్నాం. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మమ్మల్ని మట్టు బెట్టటానికి భారీ సంఖ్యలో వచ్చారు. మాకు అక్కడి గ్రామస్థులు సమాచారం అందించే ప్రయత్నం చేశారు కానీ అది అందలేదు. పలువురు గ్రామస్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’’

‘‘ఎన్ కౌంటర్ జరిగిన ఉదయం (అక్టోబరు 24న) ఉదయం రోల్ కాల్ జరుగుతోంది.అప్పుడే శిబిరానికి దగ్గరగా వచ్చిన పోలీసులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. మేం ఎదురుకాల్పులు జరిపాం. దాదాపు 40 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే కొందరు బయటపడ్డారు.  ఈ క్రమంలో కొందరు ఒక కొండ మీద నుంచి మరో కొండకు వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో చాలామంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఆ రోజు పట్టుబడిన వారిని పోలీసులు రెండు విడతల్లో గ్రామస్థుల ఎదుటే కాల్చి చంపేశారు. ఎన్ కౌంటర్ తర్వాత రెండు రోజుల్లోనూ మా వాళ్లను చంపేశారు.  మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఎలాంటి ఆయుధాలు లేని గిరిజన యువత. మా సభ్యుల్ని హత్య చేసిన రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం. ఏవోబీ నుంచి పోలీసు బలగాల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే.. టీడీపీ.. బీజేపీ ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించక తప్పదు’’

ఆర్కే గురించి సూటిగా అడగకున్నా.. ఆయనకు సంబంధించిన సమాచారం అడిగే అవకాశాన్ని ఇవ్వలేదు. ఆర్కే ప్రస్తావనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అంతా క్షేమమేనా? అన్న ప్రశ్నకు.. అంతా క్షేమమే అంటూ ఫోన్ కట్ చేయటం గమనార్హం. అంటే.. ఆర్కే ఇప్పుడు పోలీసుల అదుపులో లేనట్లా..?
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News