మ‌న మావోయిస్టులు...చైనాతో దోస్తీ క‌టీఫ్ చేశారు

Update: 2017-11-20 17:17 GMT
మావోయిస్టుల విష‌యంలో కీల‌క స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. కమ్యూనిజం, ప్రపంచ సోషలిస్టు విప్లవ పురోగమన శక్తులకు స్థావరంగా ఉన్న చైనాతో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం చైనా ఓ నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగిందని, అది పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమేనని మావోయిస్టు పార్టీ తేల్చిచెప్పింది. గత కొద్ది నెలలుగా భారత్ సహా పొరుగు దేశాలపై చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. చైనాలో మారుతున్న స్థితిగతుల నేపథ్యంలో సైద్ధాంతికంగా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ.. ‘చైనా ఓ సోషల్ సామ్రాజ్యవాద శక్తి. అది పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమే. అది ప్రపంచ కార్మికవర్గానికి, పీడిత ప్రజలకు శత్రువుగా మారింది’ అని ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్ కార్యాచరణను నిర్దేశిస్తూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన 72 పేజీల కీలక డాక్యుమెంట్ ‘ఆంధ్రభూమి’కి చిక్కింది. కార్ల్‌ మార్క్స్ - లెనిన్ సిద్ధాంత బలంతో మావో మహోపాధ్యాయుని ఆధ్వర్యంలో నవ చైనా అభివృద్ధి సాధించటంతో పాటు ప్రస్తుతం కార్పొరేట్ గుత్త్ధాపత్యంతో బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగి పీడిత, కార్మికవర్గ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తీరును డాక్యుమెంట్‌ లో పార్టీ విశ్లేచించింది  . అందులో పొందుపరచిన అంశాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.

1949-76 మధ్య జరిగిన సోషలిస్టు విప్లవం నేపథ్యంలో నూతన ప్రజాస్వామిక విప్లవానంతరం మావో మార్గదర్శకత్వాన ‘మూడేళ్ల సన్నాహం -పదేళ్ల ప్రణాళికాబద్ధమైన ఆర్థిక నిర్మాణం’ ఫలితంగా 1956 నాటికి వ్యవసాయం - చేతివృత్తులు - పరిశ్రమలు - వర్తకం - ఉత్పత్తి సాధనాలపై వ్యక్తి యాజమాన్యం తగ్గింది. చైనా ఓ నూతన ప్రజాస్వామిక సోషలిస్టు రాజ్యంగా రూపుదిద్దుకుంది. సోషలిస్టు చైనా స్వావలంబనపై ఆధారపడి పురోగమనానికి గొప్ప ముందడుగు పడింది. ‘విప్లవాన్ని అర్థం చేసుకోండి.. ఉత్పత్తిని పెంచండి’ అనే నినాదంతో ఉద్యమాలు నడిచాయి. దశాబ్దకాలం వరకు జరిగిన ఈ మహత్తర సాంస్కృతిక విప్లవ కాలంలో చైనా పారిశ్రామిక సగటు ఉత్పత్తి 13.5 శాతానికి పెరిగింది. జర్మనీ, జపాన్, సోవియట్ యూనియన్ పారిశ్రామిక అభివృద్ధిని మించిపోయింది. కార్మికుల, రైతుల జీవన ప్రమాణాలు చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడ్డాయి. నిరుద్యోగాన్ని రూపుమాపి అందరికీ పని గ్యారంటీ కల్పించారు. ఈ క్రమంలో బూర్జువా వర్గం, అభివృద్ధి నిరోధకులు ఉనికిని చాటుకునేందుకు పెట్టుబడి విధానం పునరుద్ధరణకు వ్యూహంపన్నారు. రివిజనిస్టు సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అమల్లోకి తెచ్చారు.` అని పేర్కొంది.

పిడికెడు మంది పెట్టుబడిదారులు చైనా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నతాధికారాల్ని హస్తగతం చేసుకున్నారని ఇందులో ఆక్షేఇపంచారు. `ఇలాంటి ప‌రిణామానికి వ్యతిరేకంగా మావో పదేళ్లపాటు ఉద్యమాలు నడిపారు. మావో మరణానంతరం సైద్ధాంతిక - ఆర్థిక - రాజకీయ - సాంస్కృతిక రంగాల్లో తిరిగి పెట్టుబడిదారీ విధానం వ్యవస్థీకృతమైంది. 1978లో మొదటి, 1990లో రెండోతరం ఆర్థిక సంస్కరణల పేరుతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ - ప్రపంచ బ్యాంక్ - డబ్ల్యుటీవో ఒప్పందంలో చేరడం ద్వారా సోషలిస్టు సామ్రాజ్యవాద వ్యవస్థలో చైనా అంతర్భాగమైందని సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఉటంకించింది. 1992 వరకు తైవాన్ - హాంగ్‌ కాంగ్ నుంచి కొద్దిపాటి పెట్టుబడులను ఆశించిన చైనా, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. దీంతో ఒక బిలియన్ అమెరికా డాలర్ల కంటే అధికంగా పెట్టుబడులు వచ్చాయి. 1994లో అవి 50 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమతి ప్రాధాన్యం కలిగిన పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా పెరిగింది. అధికారంలో ఉన్న కొద్దిమంది వ్యక్తుల కనుసన్నల్లో నిరంకుశ, అక్రమ వ్యాపారం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. చైనా పాలకవర్గంలో కొందరు విదేశీ పెట్టుబడిదారులతో మిలాఖత్ అయ్యారు. 2004లో ప్రపంచ విదేశీ పెట్టుబడులు పొందిన అగ్రరాజ్యంగా చైనా నిలిచింది. బహుళజాతి, కార్పొరేట్ గుత్తాదిపత్యం పెరగడంతో వ్యవసాయ రంగం కుంటుపడింది. నిరుద్యోగం పెరిగిపోయింది. చైనాలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన నాలుగు ప్రైవేటు బ్యాంకులు (బిగ్ ఫోర్) ఏర్పాటయ్యాయి. ఆర్థికంగా ఎదిగిన చైనా వ్యాపార ఒప్పందాలు, ఇతర రుణ పరపతి ద్వారా 2014 నాటికి సామ్రాజ్యవాద సోషలిస్టు దేశంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా దిగజారాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వలసలు పెరిగాయి. వ్యవసాయ రంగంలో ఉన్న యువత ఉపాధి కోల్పోయారు. గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో చైనా సంపద కొద్దిమందికే పరిమితమైంది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న చైనా సామ్రాజ్యవాద నేపథ్యంలో బలహీనమైన దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందనేది సీపీఐ మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్ సారాంశం. మారుతున్న పరిణామ క్రమంలో మరోసారి ప్రపంచ కార్మికులు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలి` అని పార్టీ శ్రేణులకు ఈ డాక్యుమెంట్ పిలుపునిచ్చింది.
Tags:    

Similar News