మావోయిస్టుల నుంచి టీఆర్ ఎస్ నేత‌ల విడుద‌ల‌

Update: 2015-11-21 05:37 GMT
ఖ‌మ్మం జిల్లాలో మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన టీఆర్ ఎస్ నేత‌ల‌కు విముక్తి ల‌భించింది. భ‌ద్రాచ‌లం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆరుగురు అధికార పార్టీ నాయ‌కుల‌ను మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న టీఆర్ ఎస్ నేతలను వారు శ‌నివారం ఉద‌యం ఛ‌త్తీస్‌ ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో వ‌దిలిపెట్టారు.

కిడ్నాప్‌ కు గురైన టీఆర్ ఎస్ నేతలు కాసేపట్లో ఖమ్మం జిల్లా చర్లకు చేరుకోనున్నారు. భద్రాచలం నియోజక వర్గ టీఆర్ ఎస్ ఇన్‌ ఛార్జి నూనె రామ‌కృష్ణ‌తో పాటు చర్ల  - వెంకటాపురం - వాజేడు మండలాలకు చెందిన  వెంకటేశ్వర్లు - సురేష్ - జనార్థన్ - రామకృష్ణ - సత్యనారాయణలను ఈ నెల 18 న చర్ల మండలం పూసుగుప్ప‌లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఛ‌త్తీస్‌ ఘ‌డ్ ప్రాంతానికి స‌రిహ‌ద్దులో చ‌ర్ల మండ‌ల కేంద్రానికి 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి ప‌థ‌కాల‌పై టీఆర్ ఎస్ నాయ‌కులు గ్రామ‌స్తుల‌తో చ‌ర్చిస్తుండ‌గా అక్క‌డ‌కు వ‌చ్చిన మావోయిస్టులు వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ మావోయిస్టుల ఎజెండానే త‌మ ఎజెండాగా ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చాక మావోయిస్టుల‌ను అణిచి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నార‌ని..కేసీఆర్ త‌న తీరు మార్చుకోక‌పోతే వీరిని వ‌దిలి పెట్ట‌మ‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. టీఆర్ ఎస్ నేత‌లంద‌రు విడుద‌ల‌వ్వ‌డంతో జిల్లాలో అధికార పార్టీ నాయ‌కులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News