హత్య అనంతరం కెమెరాకు చిక్కిన మావోయిస్టులు

Update: 2018-09-25 05:36 GMT
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను హత్య చేసిన మావోయిస్టుల కోసం వేట మొదలైంది. ఏపీ - చత్తీస్ గఢ్ - ఒడిషా రాష్ట్రాలకు చెందిన సీఆర్పీఎఫ్ - ఏపీ గ్రేహౌండ్స్ - ప్రత్యేక పోలీసు బలగాలు నలు వైపుల నుంచి కూంబింగ్ ను మొదలు పెట్టాయి. ఒడిశా - ఏపీ పోలీసులు సైతం సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అరకు పాడేరుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కూడా హై అలెర్ట్ ప్రకటించారు.  దీంతో మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

కాగా ఎమ్మెల్యే కిడారి - మాజీ ఎమ్మెల్యే సోములను హత్య చేసిన మావోయిస్టులు తుపాకులు - ఇతర ఆయుధాలు దాచిపెట్టేసి సాధారణ దుస్తులు వేసుకొని సామాన్యుల వలే పారిపోతున్న వీడియోలు మీడియాకు చిక్కాయి. ఈ ఘటన అనంతరం మావోయిస్టులు పారిపోతుండగా వారి వీడియోలను స్థానికులు తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. ఆ విజువల్స్ మీడియాకు చిక్కడంతో ప్రస్తుతం   వైరల్ గా మారాయి.

ఈ వీడియోల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హత్యలు చేశాక సాధారణ పౌరుల్లా పారిపోతుండడం గమనించవచ్చు. ఇందులో ఓ మహిళ - మరో  పురుషుడు కనిపించాడు. వారిని పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి - తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవలే మన్యంలో మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహించారు. మన్యాన్ని గెరిల్లా వార్ జోన్ గా మార్చడానికి మావోయిస్టులు నిర్ణయించినట్టు తెలిసింది.  అందుకే ఈసారి తెలంగాణ - చత్తీస్ ఘడ్ - ఒడిషాల నుంచి మెరికల్లాంటి దళ సభ్యులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపారు. ఎన్నికల సమయానికి మరిన్ని దాడులకు మావోలు ప్లాన్ చేసినట్టు సమాచారం. పోలీసులు బిజీగా ఉండే ఆ సమయంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ చేశారట.. దీంతో మన్యం మొత్తం అట్టుడుకుతోంది.
Tags:    

Similar News