మార్ బర్గ్ వైరస్.. సోకిందంటే చనిపోయేవాళ్లే ఎక్కువ ఎందుకు?

Update: 2021-08-11 02:42 GMT
వైరస్ లు విరుచుకుపడటం.. యావత్ ప్రపంచమంతా భయం గుప్పిట్లో బతకాల్సి రావటం లాంటి అనుభవాల గురించి ఏడాదిన్నర క్రితం చెప్పి ఉంటే నవ్వి పోయేవారేమో. కానీ.. కొవిడ్ 19 పుణ్యమా అని వైరస్ చేసే విధ్వంసం ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయం సగటుజీవికి సైతం అర్థమయ్యేలా చేసింది. ప్రపంచాన్ని చుట్టిముట్టేసిన మహమ్మారి నుంచి ఇప్పటికి బయట పడింది లేదు. ఇలాంటివేళలో కొత్త వైరస్ మాటే వణుకు తెప్పిస్తున్నాయి. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో బయటకు వచ్చిన కొత్త వైరస్ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది.

ఆ దేశంలో గేక్కేడౌ అనే ప్రాంతంలో గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే మార్ బర్గ్ వైరస్ ను గుర్తించారు. దీని బారిన పడిన వ్యక్తి తాజాగా మరణించారు. దీంతో.. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలిన వైనం అధికారికంగా నమోదైంది. ఈ కొత్త వైరస్ ఎబోలా వైరస్ జాతికి చెందినదే కావటం గమనార్హం. ఎబోలాను కంట్రోల్ చేసేందుకు గినియా దేశం చాలానే ప్రయత్నించింది. ఆర్నెల్ల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత దాని బారి నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునేంతలో.. అదే జాతికి చెందిన మార్ బర్గ్ వైరస్ బయటకు వచ్చి కొత్త టెన్షన్ ను తీసుకొచ్చింది.

కొవిడ్ మాదిరే.. ఈ వైరస్ కూడా ఇట్టే వ్యాపిస్తుంది. ఇదే ఇప్పటి భయానికి కారణం. కొవిడ్ లో మరణాల రేటు ఒకటి నుంచి 5 శాతం ఉంటే.. తాజా వైరస్ మాత్రం 24-88 శాతం మధ్య మరణాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అంత భయంకరమైన ఈ వైరస్ సోకితే.. ఎలాంటి వైద్యం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. తీవ్రమైన జ్వరంతో పాటు రక్తనాళాలు చిట్లిపోయేలా చేస్తుందీ ప్రమాదకర వైరస్.

తాజాగా ఈ వైరస్ బారిన వ్యక్తిని ఎలా గుర్తించారంటే.. గత నెల (జులై) 25న ఒక వ్యక్తి తనకు తీవ్రమైన జ్వరం.. తలనొప్పి.. అలసట.. కడుపునొప్పిగా ఉందని వైద్యుల్ని సంప్రదించాడు. అతనికి చికిత్స ప్రారంభించిన తర్వాతి రోజే అతను మరణించాడు. దీంతో అనుమానం వచ్చిన వైద్యాధికారులు ఈ ఉదంతం మీద విచారణ జరిపారు. ఆ క్రమంలోనే ఈ కొత్త వైరస్ ను గుర్తించారు. పళ్లను తినే గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో.. ఈ వైరస్ విషయంలో యావత్ ప్రపంచం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా మాదిరి వ్యాప్తి చెందే వీలున్న ఇలాంటి వైరస్ కానీ వ్యాప్తి చెందితే.. మానవాళికి అంతకు మించిన వినాశనం మరొకటి ఉండదన్నది ఖాయం.
Tags:    

Similar News