భార్య‌తో బ‌ల‌వంత శృంగారం రేప్ కాదు

Update: 2017-08-10 04:38 GMT
మ‌రో కీల‌క అంశంపై దేశ అత్యున్నత న్యాయ‌స్థానం క్లారిటీ ఇచ్చేసింది. భార్య‌తో బ‌ల‌వంతంగా చేసే శృంగారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రేప్ కాబోద‌న్న కీల‌క వ్యాఖ్య‌ల్ని సుప్రీంకోర్టు చేసింది. మారిట‌ల్ రేప్ ను నేరంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఇదే అంశంపై భార‌త పార్ల‌మెంటు గ‌తంలో విస్తృతంగా చ‌ర్చించిన విష‌యాన్ని జ‌స్టిస్ ఎంబీ లోకూర్.. జ‌స్టిస్ దీప‌క్ గుప్తాల ధ‌ర్మాసనం తాజాగా వెల్ల‌డించింది.

అయితే.. భార్య కానీ మైన‌ర్ అయితే మాత్రం రేప్ కింద‌కు వ‌స్తుంద‌ని పేర్కొంది. మైన‌ర్ భార్య‌తో శృంగారంలో పాల్గొన‌టానికి అనుమ‌తిస్తున్న నిబంధ‌న‌ల రాజ్యాంగ‌బ‌ద్ధ‌త‌ను ప్ర‌శ్నిస్తూ ఒక పిటీష‌న్ దాఖ‌లైంది. ఈ సంద‌ర్భంగా సుదీర్ఘ వాదోప‌వాదాల అనంత‌రం కోర్టు తాజాగా స్ప‌ష్ట‌మైన తీర్పును ఇచ్చింది.

ఐపీసీ సెక్ష‌న్ 375 ప్ర‌కారం భార్య వ‌య‌సు 15 సంవ‌త్స‌రాల లోపు ఉంటే.. ఆమె ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా శృంగారంలో పాల్గొంటే నేర‌మే అవుతుంద‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో ఆమె వ‌య‌సు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు ఉంటే ఆమె అంగీక‌రం లేకుండా శృంగారం చేసినా నేరం కాద‌ని సుప్రీం తేల్చింది. దీంతో.. భార్య అనుమ‌తి లేకుండా ఆమెతో శృంగారం చేయ‌టాన్ని మారిట‌ల్ రేప్ అనే అస్కారం లేద‌న్న విష‌యాన్ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తేల్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇండిపెండెంట్ థాట్ అనే స్వ‌చ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.  ఐపీసీ 375 క్లాజ్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని.. అది దేశ పౌరులంద‌రికి ప్ర‌సాదించిన స‌మాన‌త్వ‌.. గౌర‌వంగా జీవించే హ‌క్కుల‌కు విఘాతం కలిగిస్తుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింది.  18 ఏళ్ల లోపు మ‌హిళ‌ల‌తో వారి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది రేప్ కింద‌కే వ‌స్తుంద‌ని.. అలాంటిది వివాహం అనే ఒక్క కార‌ణంతో అది రేప్ కాకుండా పోద‌న్న‌ది స‌ద‌రు సంస్థ వాద‌న‌.

వివాహం జ‌రిగిందా?  లేదా అన్న విష‌యాన్ని సంబంధం లేకుండా శృంగారానికి స‌మ్మ‌తి ఇవ్వ‌ద‌గిన వ‌య‌సును 18 ఏళ్లుగా నిర్థారించాలని.. ఆ లోపు వ‌య‌సున్న అమ్మాయిల‌తో భ‌ర్తే శృంగారంలో పాల్గొన్నా రేప్ కింద ప‌రిగ‌ణించాల‌ని స‌ద‌రు సంస్థ కోరింది. దీనికి స్పందించిన ధ‌ర్మాస‌నం  ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టం ప్ర‌కారం 15 ఏళ్ల లోపు అమ్మాయిల‌తో వారి స‌మ్మ‌తితో శృంగారంలో పాల్గొన్న అది రేప్ కింద‌కే వ‌స్తుంద‌ని.. 15-18 ఏళ్ల లోపు వివాహిత‌ల స‌మ్మ‌తితో వారి వారి భ‌ర్త‌లు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కింద‌కి రాద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై ఇప్ప‌టికే పార్ల‌మెంటులో విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింద‌ని.. అది అత్యాచారం కింద‌కు రాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన త‌దుప‌రి విచార‌ణను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.
Tags:    

Similar News