జుక‌ర్ నోరు విప్పాడు.. త‌ప్పు ఒప్పుకున్నాడు

Update: 2018-03-22 05:39 GMT
గ‌డిచిన నాలుగు రోజులుగా ప్ర‌పంచ వ్యాప్తంగా పెనుదుమారానికి కార‌ణ‌మైన ఫేస్ బుక్ డేటా బ్రీచ్ పై సంస్థ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ నోరు విప్పాడు. ఐదు కోట్ల మంది ఫేస్ బుక్ యూజ‌ర్ల డేటా లీక్ అయ్యింద‌న్న అంశంపై ఆయ‌న స్పందించి.. త‌న ఫేస్ బుక్ ఖాతాలో భారీ పోస్ట్ ఒక‌టి పెట్టారు. త‌ప్పు జ‌రిగిన తీరుపై త‌న ఆవేద‌న‌తో పాటు.. యూజ‌ర్ల డేటా ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో తాము తీసుకున్న జాగ్ర‌త్త‌ల్ని ఆయ‌న వెల్ల‌డించారు.

డేటా ర‌క్ష‌ణ విష‌యంలో తాము అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌న్న జుక‌ర్‌..కోగ‌న్‌.. కేంబ్రిడ్జ్‌.. ఎన‌లిటికా సంస్థ‌లు చేసింది విశ్వాస ఉల్లంఘ‌న అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సంస్థ‌ల కార‌ణంగా ఫేస్ బుక్ కు డేటాను పంచుకున్న యూజ‌ర్ల న‌మ్మ‌కాన్ని దెబ్బ తీసింద‌న్నారు. దీన్ని ప‌రిష్క‌రించాల్సి ఉంద‌న్న విష‌యాన్ని ఒప్పేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

నాలుగు రోజులుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ మౌనంగా ఉన్న జుక‌ర్  కొన్ని గంట‌ల క్రితం త‌న పోస్టుతో స్పందించారు. కేంబ్రిడ్జ్ ఎన‌లిటికాకు సంబంధించిన అంశంపై తాను కొంత అప్డేట్ ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లుగా చెప్పిన జుక‌ర్.. సంస్థ ఇప్ప‌టికే తీసుకున్న చ‌ర్య‌ల్ని వివ‌రించారు. అస‌లేం జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని.. ఇలాంటి ఘోర‌మైన త‌ప్పిదం మ‌రోసారి జ‌ర‌గ‌ద‌నే హామీ ఇస్తున్న‌ట్లుగా చెప్పారు.

సంతోషించాల్సిన అంశం ఏమిటంటే.. ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చిన అంశాల‌కు సంబంధించి గతంలోనే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని.. అయిన‌ప్ప‌టికీ కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. తాము చేయాల్సింది చాలా ఉంద‌న్నారు. యూజ‌ర్ల డేటాను ర‌క్షించ‌టం త‌మ ప్ర‌ధాన బాధ్య‌త‌గా చెప్పిన జుక‌ర్.. యూజ‌ర్ల డేటాను ప‌రిర‌క్షించే విష‌యంలో త‌ప్పు చేస్తే తాము యూజ‌ర్ల‌కు సేవ చేసే అర్హ‌త‌ను కోల్పోతామ‌ని చెప్పారు.

జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి సంస్థ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. సంస్థ మీద న‌మ్మ‌కం ఉంచిన వారంద‌రికి ధ‌న్య‌వాదాల‌న్న జుక‌ర్.. అంతా క‌లిసి ప‌ని చేద్దామ‌ని.. స‌మ‌స్య ప‌రిష్కారానికి సుదీర్ఘ స‌మ‌యం ప‌ట్టొచ్చు కానీ.. మ‌రింత మెరుగైన సేవ‌ల‌తో మ‌రింత ఎక్కువ కాలం సేవ‌లు అందిస్తామ‌న్న హామీని ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.  మొత్తంగా త‌న సుదీర్ఘ పోస్టుతో.. త‌న‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం జుక‌ర్ చేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News