ఫేస్ బుక్ అధినేతకు షాక్.. నిజంగానే టెక్నికల్ మిస్టేకా?

Update: 2022-10-13 04:31 GMT
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ఏమైంది? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల పాటు సాగిన గందరగోళం.. పలువురికి షాకింగ్ గా మారింది. చివరకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్ బర్గ్ కు సైతం ఈ తరహా షాక్ తప్పలేదు. ఆయనకు ఫేస్ బుక్ లో ఉన్న ఫాలోవర్లు అక్షరాల 11.9 కోట్లు. అలాంటి ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 వేల దిగువకు పడిపోవటం పెద్ద సమస్యగా మారింది.

ఇలాంటి పరిస్థితి ఒక్క జుకర్ బర్గ్ కు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్ సంచలన రచయిత్రి తస్లీమా నస్రీన్ కు తొమ్మిది లక్షల మంది పాలోవర్లు ఉన్నారు. అలాంటి ఆమె అకౌంట్ లో పాలోవర్ల సంఖ్య కేవలం 9వేలకు పరిమితం కావటం.. దానికి కారణం ఏమిటో అర్థం కాక ఆమె తనకు ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది.

ఫేస్ బుక్ లో ఫాలోవర్ల సంఖ్యలో అనూహ్యంగా పడిపోయే సమస్య రేపిన టెన్షన్ అంతా ఇంతా కాదు. దీనికి సరైన కారణం తెలీక గగ్గోలు పెట్టే పరిస్థితి. అసలేం జరిగిందని.. ఫాలోవర్లు అంత భారీగా ఆన్ ఫాలో అయ్యారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

ఎంతోమంది ప్రముఖులకు ఇలాంటి షాకులు తప్పలేదు. అయితే.. మొదట ఈ ఇష్యూ గురించి సరిగా అడ్రస్ చేయని ఫేస్ బుక్.. సాయంత్రానికి మాత్రం వివరణను వెల్లడించింది. ఎంతో మంది ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య భారీగా పడిపోయిన వైనంపై సంస్థ ప్రతినిధులు సారీ చెప్పారు.

సాయంత్రానికి ఎప్పలానే.. ఫేస్ బుక్ లోని ఫాలోవర్ల సంఖ్య రిట్రీవ్ కావటంతో పలువురు ప్రముఖులు.. సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ.. ఇలా ఎందుకు జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయం మీద మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వకపోవటం గమనార్హం. ఫేస్ బుక్ లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగటమే దీనికి కారణంగా  కొందరు విశ్లేషిస్తున్నారు.

బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్ గా మెసేజ్ లు పంపటం.. ఫాలోవర్ల సంఖ్యను పెంచటం లాంటివి చేయొచ్చన్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాటిని తొలగించే ప్రయత్నం ఫేస్ బుక్ చేయటంతో ఇప్పుడున్న పరిస్థితి తలతెత్తినట్లుగా విశ్లేషిస్తున్నారు. బాట్ అకౌంట్లను తొలగించే వేళలో.. చోటు చేసుకున్న సాంకేతిక లోపమే ఈ మొత్తం పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇవేమీ కారణాలు కావు.. ఫేస్ బుక్ లో కొత్త అల్గారథిమ్ ను టెస్టు చేశారని.. ఈ క్రమంలోనే ఇలాంటి రచ్చ చోటు చేసుకొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా మాత్రం ఫేస్ బుక్ నోరు తెరిచి.. ఇలా ఎందుకు జరిగిందన్నమాటను చెప్పక పోవటం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News