జుక‌ర్‌ బ‌ర్గ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2015-12-02 06:18 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పౌరులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చిన ఫేస్‌ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్ మ‌రో విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. ఫేస్‌ బుక్‌ కు చెందిన 99శాతం షేర్లను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. సమాజ హితం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ఆస‌క్తికరం.

ప్ర‌పంచ స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ల చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత భారీ మొత్తాన్ని స్వ‌చ్ఛంద సేవ కోసం ఇవ్వ‌డం వెనుక కారణం ఏంటంటే జుకర్ బర్గ్ జీవితంలో కీల‌క మ‌లుపు ప్రారంభమవడమే. ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బెర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ల జీవితంలోకి వారం క్రిత‌మే చిన్నారి మాక్స్ వ‌చ్చింది. త‌మకు పాపాయి పుట్టిన సంబరంలో ఫేస్‌ బుక్ అధినేత జుక‌ర్‌ బ‌ర్గ్, ఆయ‌న స‌తీమ‌ణిగా సంస్థ‌లో వారిద్ద‌రికీ ఉన్న షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇస్తామని ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యాన్ని తమ కూతురు మాక్స్‌ కు రాసిన లేఖలో తెలుపుతూ ఆ లేఖను జుకెర్‌ బెర్గ్ తన ఫేస్‌ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

ప్ర‌స్తుత మార్కెట్ విలువ ప్ర‌కారం ఆ షేర్ల విలువ 45 అమెరిక‌న్ బిలియ‌న్ డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ. 3 లక్షల కోట్లు. చాన్ జుకెర్‌ బెర్గ్ పేరుతో స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ను ప్రారంభించి ఆ ట్ర‌స్టు ద్వారా ఈ సొమ్మును ఖ‌ర్చుచేయ‌నున్నారు. వారి జీవితకాలంలోనే ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్‌ బెర్గ్ ఆకాంక్షించారు.ఇంత‌కీ ఇదంతా ఎందుకు చేస్తున్నామో కూడా జుకెర్‌ బ‌ర్గ్ ప్ర‌క‌టించాడు.

మాక్స్ రావ‌డంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభం అయ్యాయ‌ని...తల్లిదండ్రులుగా తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తుండటంతోనే ఇలా చేస్తున్నామని చెప్పారు. ప్ర‌పంచం త‌మ‌కు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వ‌డంలో భాగంగా...తమతో పాటు ప్రపంచవ్యాప్తంగా బలమైన సైన్యం ఉండటం వల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. త‌మ కృషిలో ఫేస్‌ బుక్ స‌భ్యులైన‌ ప్రతి ఒక్కరు తన వంతు పాత్ర పోషిస్తున్నట్లేనని వివరించాడు.
Tags:    

Similar News