ఢిల్లీ ఐఐటీయ‌న్ల‌తో ఫేస్ బుక్ సీఈవో

Update: 2015-10-28 10:19 GMT
భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌.. బుధ‌వారం ఢిల్లీ ఐఐటీ ప్రాంగ‌ణంలో విద్యార్థుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. అనంత‌రం అధ్యాప‌కులు.. విద్యార్థులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ప‌లు ప్ర‌శ్న‌లకు ఆచితూచి స‌మాధానాలు ఇచ్చిన ఆయ‌న‌.. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు కాస్తంత ఇబ్బంది ప‌డ్డారు. దాదాపు 900 మంది పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మార్క్ మాట్లాడారు. ఫేస్‌ బుక్ సీఈవో చెప్పిన మాట‌లు.. విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌లు.. వాటికి ఆయ‌నిచ్చిన స‌మాధానాలు చూస్తే..

=  భార‌త్ లో 13కోట్ల మంది ఫేస్ బుక్ యూజ‌ర్లు ఉన్నారు. ప్ర‌పంచంలో ఫేస్ బుక్ ను అత్య‌ధికంగా వినియోగించే దేశాల్లో భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఫేస్ బుక్ కు భారత్ ఎంతో కీల‌కం. ఫేస్ బుక్ భార‌త్ కు ప్ర‌ధాన‌మార్కెట్ కూడా.

= ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌ను చికాకు పెట్టే క్యాండీ క్ర‌ష్ ఇన్విటేష‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మా డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. నేను మ‌రో స‌మావేశంలో పాల్గొనే స‌మ‌యానికి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల్సిందిగా మా డెవ‌ల‌ప‌ర్స్ ను కోరా. వారిప్పుడు అదే ప‌నిలో ఉన్నారు.

= ఫేస్ బుక్ ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు మెరుగుప‌ర్చుకోవ‌ట‌మే మా ఉద్దేశం.

= అంధులు సైతం ఫేస్ బుక్ వినియోగించేలా ప్ర‌ణాళికులు రూపొందిస్తున్నాం.

= భార‌త్ ను సంద‌ర్శిచ‌టం చాలా సంతోషంగా ఉంది.

= భార‌త్‌లో ప్ర‌తి ఒక్క‌రిని ఇంట‌ర్నెట్ తో అనుసంధానిస్తేనే.. ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రిని అనుసంధానించ‌టం సాధ్య‌మవుతుంది.

= ఇంట‌ర్నెట్‌.ఆర్గ్ తో 15 మిలియ‌న్ల మందిని ఆన్‌లైన్ లోకి తీసుకొచ్చాం. ప్ర‌పంచంలో నాలుగు బిలియ‌న్ల మందికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేదు. ప్ర‌తిఒక్క‌రిని ఇంట‌ర్నెట్ తో అనుసంధానం చేయ‌ట‌మే ల‌క్ష్యం.

= ఇంట‌ర్నెట్ ను ఉచితంగా ఇవ్వ‌టం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.

= ఫేస్‌బుక్ వినియోగిస్తున్న‌ప్ర‌తి ప‌ది మందిలో ఒక‌రికి ఉద్యోగాలు వ‌స్తున్నాయి.

= ఆఫ్రికాలో కొత్త త‌ర‌హా పాఠ‌శాల‌లు ప్ర‌వేశ పెడుతున్నాం. భార‌త్ లో కూడా వీటికి తీసుకొచ్చే ఆలోచ‌న ఉంది.

= భార‌త్ లో రెండు వైరుధ్యాలున్నాయి. ఈ దేశంలో ఫేస్‌బుక్‌.. వాట్స‌ప్ భారీగా వినియోగిస్తున్నారు. మ‌రోవైపు చాలామందికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేదు.

= ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉంటే పేద విద్యార్థుల‌కు మెరుగైన పాఠ‌శాల‌ల్ని అందిదొచ్చు.

= ఆఫ్గానిస్థాన్ భూకంప స‌మ‌యంలో దాదాపు 30ల‌క్ష‌ల మంది తాము సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఫేస్ బుక్ లో చెప్పారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌ట‌మే మా మిష‌న్‌.

= ఇంట‌ర్నెట్‌.ఆర్గ్ నూటికి నూరుపాళ్లు నెట్‌న్యూట్రాలిటీకి మ‌ద్ద‌తు ప‌లుకుతుందా అన్న ప్ర‌శ్న‌కు.. చాలావ‌ర‌కు మ‌ద్ద‌తు ఇస్తాం. అయితే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే.. పూర్తిగా ఇంట‌ర్నెట్ ఉచితంగా అందించ‌టం సాధ్యం కాదు.

= రానున్న ఐదేళ్ల నుంచి ప‌దేళ్ల‌లో కృత్రిమ మేధోత‌నం ప‌రిశోధ‌న‌ల‌కుసంబంధించిన ఉత్ప‌త్తులు అందించ‌నున్నాం. మ‌నుషుల కంటే మిన్న‌గా స‌మ‌య‌స్ఫూర్తి ఉండే కంప్యూట‌ర్ల‌ను త‌యారీకి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ సాంకేతిక‌త సాయంతో అంధుల‌కు ఫోటోల గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

= పేద చిన్నారులు ప‌డుతున్న ఇబ్బందులు తెలుసు. వారిలో చాలామంది క‌నీసం స్కూలు.. ఆసుప‌త్రి స‌దుపాయం కూడా లేవు. టెక్నాల‌జీతో వారికి సాయాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

= సూప‌ర్ ప‌వ‌ర్ బ‌హుమ‌తిగా వ‌స్తే.. ఏ శ‌క్తి కావాల‌ని కోరుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ఒక‌టికి రెండుసార్లు న‌వ్వేసిన మార్క్‌.. టెక్నాల‌జీలో ఉన్న మంచి గుణం ఏమిటంటే.. దేనినైనా త‌యారు చేసుకోవ‌చ్చు. సూప‌ర్‌ప‌వ‌ర్ ను మ‌న‌మేఅభివృద్ధి చేసుకోవ‌చ్చు.

= భార‌త్ మీద అమితాస‌క్తి వెనుక నిజాయితీతో కూడిన స‌మాధానం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్ అని.. ప్ర‌పంచంలోని  ప్ర‌తిఒక్క‌రితో క‌నెక్ట్ కావాల‌న్న‌దే ల‌క్ష్యం అయిన‌ప్పుడు భార‌త్ లేకుండా సాధ్యం కాదు. భార‌త ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ కావటం చాలా అవ‌స‌రం.

= అగ్రాలో తాజ్ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన మిమ్మ‌ల్ని ఎవ‌రైనా గుర్తు ప‌ట్టారా? అని ప్ర‌శ్నిస్తే.. త‌న‌ను ఫోటో తీయ‌టానికి ఒక అమ్మాయి ప్ర‌య‌త్నించి కింద ప‌డిన‌ట్లు చెప్పారు.

=  తాజ్ అనుభూతిని ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ప్ర‌పంచంలో చాలానే దేశాలు తిరిగా. ఎన్నోక‌ట్ట‌డాలు చూశా. ప్ర‌పంచం వ్యాప్తంగా ఉన్న క‌ట్ట‌డాల‌న్నీ యుద్ధ విజ‌యాల్ని పుర‌స్క‌రించుకొని నిర్మించిన స్మార‌కాలే. కానీ.. తాజ్ మాత్రం ప్రేమ చిహ్నం. తాజ్ న‌న్ను అబ్బురానికి గురి చేసింది. కాసేపు అక్క‌డ గ‌డ‌ప‌టం చాలా ఆనందాన్నిక‌లిగించింది
Tags:    

Similar News