కేటీఆర్ అండ్ కో మీద మర్రి సైలెంట్ ‘ఎటాక్’

Update: 2016-05-10 04:42 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చాలామంది నోటి మీద బతికేస్తుంటారు. కానీ.. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నం. ఆయన మాటలు తక్కువ.. చేతలు ఎక్కువన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. చేయాల్సిన పనిని సైలెంట్ గా చేసేసి షాక్ ఇవ్వటం ఆయనకు అలవాటు. ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా షాకిస్తే దారికి వస్తారో ఆయనకు బాగానే తెలుసు. కాకుంటే గుట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఏదైనా విషయం మీద పోరుబాట పట్టారంటే అమూలాగ్రం స్టడీ చేసి.. దాని సంగతి చూసేంతవరకూ వదిలిపెట్టని వైనం ఆయన సొంతం.

అలాంటి ఆయన కన్ను ఇప్పుడు పాలేరు ఉప ఎన్నిక మీద పడింది. ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ అధికారపక్ష ముఖ్యనేతలు మంత్రి కేటీఆర్.. మరో మంత్రి కమ్ అభ్యర్థి తుమ్మలలు ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించారన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణతో పాటు.. అనైతిక చర్యలకు పాల్పడుతుందని చెబుతున్నారు.

ఎన్నికల నిబంధనలకు భిన్నంగా ఈ నెల 8న కల్లుగీత కార్మికులతో కుల సమావేశాన్ని తెలంగాణ అధికారపక్షం నిర్వహించిందని.. దీనికి మంత్రి కేటీఆర్.. పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారని.. ఈ సందర్భంగా వారు ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఓటేయాలని కోరారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పేందుకు వీలుగా.. ఈ ప్రోగ్రామ్ ను కవర్ చేసిన మీడియా సంస్థల క్లిప్స్ ను ఎన్నికల సంఘానికి అందించారు. నిబంధనల మీద పక్కా అవగాహన ఉన్న శశిధర్ రెడ్డి చేసిన తాజా ఫిర్యాదు తెలంగాణ మంత్రులకు ఇబ్బందికరంగా మారే వీలు ఉందని.. ఈ ఫిర్యాదు మీద కేటీఆర్.. తుమ్మలకు నోటీసులు ఇచ్చే వీలుందన్న మాట చెబుతున్నారు. నాలుగు ఘాటైన విమర్శలు చేసే కన్నా.. ప్రత్యర్తి చేసే తప్పులపై డేగకన్ను వేసి.. టైం చూసుకొని ఎటాక్ చేసి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్న మర్రి ప్లాన్ ఏ మేరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News