అద్దెకు పెళ్లి కూతురు ల‌భించును!

Update: 2016-12-13 17:30 GMT
అవ‌స‌రంలో ఉన్నవాళ్ల‌ని - అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న వాళ్ల‌ను మోస‌గాళ్లు ఎన్నో విధాలుగా మాయ చేస్తున్న ఉదంతాలు మనం చూస్తునే ఉన్నాం. ఇందులో మ‌రో ఎపిసోడ్ పెళ్లి సంబంధాలు. పెళ్లి సంబంధాల పేరిట హైద‌రాబాద్ నగరంలో కొన్ని మ్యారేజ్ బ్యూరోలు నయా మోసానికి పాల్పడుతున్నాయి. వ‌ధువు పేరుతో ప్ర‌క‌ట‌న ఇచ్చే మ్యారేజ్ బ్యూరోలు ఎదుటి వారి అవసరాన్ని బట్టి అద్దెకు పెళ్లి కూతురును తీసుకొచ్చి .. పార్కుల్లో పెళ్లి చూపులు చూపిస్తున్నారు. ఒక్కోసారి వారి కార్యాలయాల్లో పనిచేసే అమ్మాయిలను చూపిచ్చి.. అనంతరం నచ్చలేదని చెప్పిస్తున్నారు. కొన్ని సార్లు అడ్డా కూలీల‌ను కూడా వాడుకుంటుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇలా మ్యారేజ్ బ్యూరోల బారిన పడి చాలా మంది మోసపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేక - బయటకు తెలిస్తే పరువుపోతుందని గప్‌ చుప్‌ గా ఉంటారు. ఎక్కువ ఆస్తులు ఉండి.. వయస్సు మీదపడ్డ వారినే టార్గెట్ చేసి పెళ్లి చూపుల పేరుతో వేలవేలకు లాగుతుండ‌టం ఆస‌క్తిక‌రం.

ఇటీవల హైద‌రాబాద్ పోలీసుల‌కు చెందిన ఇంటెలిజెన్స్ వింగ్ దాడుల్లో పట్టుబడిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల నిర్వాహకాన్ని చూసి పోలీసులే కంగుతింటున్నారు. మ్యారేజ్ బ్యూరోలు వందల్లో పెట్టుబడి పెట్టి.. వేలల్లో దోచుకుంటున్నారని తేలింది. వీరు ముందుగా పత్రికలు - ఇంటర్‌ నెట్‌ లో పెళ్లి సంబంధాల ప్రకటనలు ఇస్తారు. ఇవి చూసి వచ్చినవారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు - తదితర ఖర్చుల నిమిత్తం వేలకు వేలు వసూలు చేస్తారు. అద్దెకు అమ్మాయిల‌ను లేదా వీరి కార్యాలయాల్లో పనిచేసే అమ్మాయిలను తీసుకువచ్చి పార్కుల్లో పెళ్లి చూపులు చూపిస్తారు. అనంతరం ఎదో ఒక కారణంతో స‌ద‌రు వ‌రుడు నచ్చలేదని చెప్పిస్తారు. వేలవేలకు చెల్లించి, అడ్డంగా మోసపోయిన చాలా మంది బయటకు తెలిస్తే పరువు పోతుందని కామ్‌ గా ఉంటున్నారు.

ఇలా  మోసపోతున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటుండ‌టం మ‌రింత గ‌మ‌నార్హం. భర్త చనిపోయి - పిల్లపాపలు లేకుండా కోట్ల రూపాయల ఆస్తి కల్గిన ఒంటరి మహిళలకు వయస్సు - కులం - మతంతో నిమిత్తం లేకుండా వరుడు కావాలంటూ కొన్ని దిన పత్రికలలో మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటన వేస్తుంటారు. అందులో ఉన్న నెంబర్‌ ను చూసి చాలమంది ఫోన్లు చేస్తారు. ఫోన్ చేసిన వారికి వధువును చూపిస్తామని - అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ బ్యూరో నిర్వాహకులు సూచిస్తారు. రూ. 1000 నుంచి రూ. 8 వేల వరకు ఫీజు వసూలు చేస్తారు. అయితే వధువును చూపించడానికి తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని కొందరు - అద్దెకు మహిళలను తీసుకొచ్చి మరికొందరు పెళ్లి చూపులు పెట్టిస్తున్నారు. కొందరు కార్యాలయాల్లోనే ఈ ఏర్పాట్లు చేస్తుండగా మరికొందరు పార్కుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. అద్దెకు వచ్చే వధువులకు రోజుకు రూ. 600 నుంచి రూ. 1000 చెల్లిస్తున్నారు. పెళ్లి సంబంధంలో వరుడికి, వధువు నచ్చిందని చెబితే... వధువుకు నచ్చలేదని బ్యూరో నిర్వాహకులు చెబుతారు. మరొక సంబంధం చూస్తామంటూ నమ్మించి, మరొక అద్దె మహిళ ఫోన్ నెంబర్ ఇచ్చేసి రెండు మూడుసార్లు మాట్లాడించి, ఆ డీల్ క్లోజ్ చేస్తుంటారు. ఇలా ఒక్కో ప్రకటన ఇచ్చినప్పుడల్లా 10 మంది వరకు బాధితులను మోసం చేస్తుంటారు. వారానికి ఒకటి, రెండు ప్రకటనలు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు.

దీనిపై పోలీసులు జాగ్ర‌త్త‌లు వివ‌రిస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో నిర్వాహ‌కులు మూడు, నాలుగు వందలతో దిన పత్రికలలో ప్రకటన ఇస్తుండ‌గా...వాటిని చూసిన అమాయకులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తూ మోసపోతున్నారని తెలిపారు. ముందుగా డబ్బులు చెల్లించకుండా  గతంలో ఎవరికైనా మ్యారేజ్‌ లు కుదిర్చారా? అసలు నిర్వాహకులు ఏమి చేస్తుంటారు? వారి వ్యవహారశైలి గురించి తెలుసుకోవాల‌ని సూచిస్తున్నారు. పెళ్లి చూపులంటూ కార్యాలయాలలో, రోజు కూలీలను తీసుకువచ్చి ఏర్పాటు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని షాకింగ్ న్యూస్‌ ను వెళ్ల‌డించారు. మోసం జరుగుతుందని దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని కోరుతున్నారు. మోస‌పోయిన వారిలో ఒకరిద్దరు మాత్రమే దైర్యంగా ఫిర్యాదు చేస్తున్నార‌ని, చాలమంది పరువు పోతుందని విషయాన్ని బయటకు చెప్పడం లేదని పోలీసులు వివ‌రిస్తున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News