అంతా హింగిస్‌ మహాతల్లి చలవే!

Update: 2015-09-15 04:19 GMT
సానియా మీర్జా ఈ ఏడాదిలో రెండో గ్రాండ్‌ స్లాం టైటిల్‌ ను సాధించేసిందని మనమంతా తెగ మురిసిపోతున్నాం. నిజానికి మనం మురిసిపోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే మన దేశానికి ఏకంగా అయిదు గ్రాండ్‌ స్లాం టైటిళ్లు లభించాయి. ఈ ఏడాదిలో లియాండర్‌ పేస్‌ కు మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ - సానియాకు రెండు విమెన్‌ డబుల్స్‌ టైటిళ్లు లభించాయి. ఏదశలో అయినా సరే టెన్నిస్‌ లో మన దేశానికి చెందిన క్రీడాకారులు ఈ రేంజిలో పెర్ఫార్మెన్స్‌ ను ప్రదర్శించి.. దేశానికి టైటిల్స్‌ సాధించిన చరిత్ర ఇదివరకు ఎప్పుడూ లేదు. అంతెందుకు సరిగ్గా గత సంవత్సరంలో మన ఆటగాళ్లు సాధించిన ఘనత సున్నా. అయితే అప్పటికీ ఇప్పటికీ ఈ ఇద్దరూ ఇంత ఘనంగా పెర్ఫార్మ్‌ చేయడం వెనుక ఉన్న ఒకే ఒక్క తేడా మార్టినా హింగిస్‌.

ఒక్క ఏడాదిలో పేస్‌ - సానియాల ఆటతీరు ఇంతగా మారిపోయిందా? అని నివ్వెరపోయే అవసరం లేదు. మారిపోయిందంతా వారి జోడీ మాత్రమే.. వ్యూహాల పరంగా గానీ, దూకుడు పరంగా గానీ.. వీరి ఆటతీరును ప్రభావితం చేస్తూ.. గైడ్‌ చేస్తూ.. చిన్న పొరబాట్లు జరుగుతూ ఉన్నా వాటిని తాను అధిగమించేస్తూ.. దూకుడుగా ఆడి ఆట ఫలితాన్ని ఒంటిచేత్తో శాసించగల అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌.. వీరికి పార్టనర్‌ గా లభించడమే ఇక్కడ అన్నిటికంటె కీలకమైన అంశం.

విషయం అంతా మార్టినా హింగిస్‌ లోనే ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాదిలో పేస్‌ - సానియాలు ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయారు. ఈసారి హింగిస్‌ తో జతకలిశాక పేస్‌ మూడు - సానియా రెండు నెగ్గారు. క్రీడా పరిభాష ప్రకారం ప్రస్తుతం ఉన్న వీరి జోడీల నడుమ సమన్వయం చాలా చక్కగా కుదరడం వల్ల, కోర్టులో కదలికలపై ఇద్దరికీ పట్టు ఉండడం వల్ల ఇలా వరుస విజయాలు సాధ్యమవుతున్నాయి. అసలు సానియా - హింగిస్‌ ల జోడీ అయితే.. ఈ యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో కనీసం ఒక్క సెట్‌ కూడా ప్రత్యర్థులకు కోల్పోకుండా.. ఏకపక్షంగా ప్రారంభం నుంచి టైటిల్‌ గెలవడం వరకు విజయాలు సాధించింది. మొత్తానికి గెలిచిన టైటిల్స్‌ కు సంబంధించి మనవాళ్ల ఘనతను అభినందించే ముందు థాంక్స్‌ టూ హింగిస్‌ అంటూ ఒకసారి చెప్పుకోవాల్సిందే.
Tags:    

Similar News