సీఎం వ‌స్తున్నార‌ని వీర‌జ‌వాను ఇంటికి ఏసీ!

Update: 2017-05-15 08:35 GMT
అధికారుల అత్యుత్సాహం ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌ల సుడిగుండంలో ప‌డేలా చేస్తుంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వ్య‌వ‌హారం కూడా ఇలాంటిదే. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి విమ‌ర్శ లేకుండా.. అంద‌రి మ‌దిని దోచుకుంటూ పోతున్న యూపీ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ స‌ర్కారు.. తాజాగా మాత్రం విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

ఇటీవ‌ల స‌రిహ‌ద్దుల్లో వీర‌జ‌వాను ప్రేమ్ సాగ‌ర్ ను అత్యంత దారుణంగా పాకిస్థాన్ సైనికులు హ‌త‌మార్చ‌టం తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. వీర‌జ‌వాను త‌ల‌ న‌రికిన వైనంపై అశేష భార‌తావ‌ని మండిప‌డింది. వీర‌జ‌వాను కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలంటూ అంత్యక్రియ‌లు జ‌ర‌ప‌కుండా ఆందోళ‌న‌కు దిగిన వైనంపై యూపీ ముఖ్య‌మంత్రి వెంట‌నే స్పందించి.. పెద్ద క‌ర్మ నాటికి తాను బాధిత కుటుంబాన్ని స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తానంటూ సందేశం పంప‌టంతో.. వీర జ‌వాను అంత్య‌క్రియ‌ల్ని పూర్తి చేశారు.

తాను ఇచ్చిన మాట ప్ర‌కారం.. వీర జ‌వాను ఇంటిని సంద‌ర్శించారు ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్‌. అయితే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అధికారులు ప్ర‌ద‌ర్శించిన అత్యుత్సాహం.. యోగి స‌ర్కారును న‌వ్వుల‌పాలు చేసేలా చేసింది. ముఖ్య‌మంత్రి వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న అధికార యంత్రాంగం.. వీర‌జ‌వాను ఇంటికి ఆఘ‌మేఘాల మీద సోఫా.. కార్పెట్.. ఏసీల‌ను అమర్చ‌ట‌మే కాదు.. కొత్త ట‌వ‌ల్స్ ను ఏర్పాటు చేసి.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ముఖ్య‌మంత్రి యోగి రావ‌టం.. వీర జ‌వాను కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. తాను సాయం చేస్తాన‌ని మాట ఇచ్చి వెళ్లిపోయారు. సీఎం వెళ్లారో లేదో.. స‌ద‌రు ఇంట్లో అమ‌ర్చిన సోఫా సెట్టు.. ఏసీ.. కార్పెట్ మొత్తం మూట క‌ట్టుకొని వెళ్లిపోవ‌టంపై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి ముందు ఆర్భాటం ప్ర‌ద‌ర్శించిన అధికారుల ముచ్చ‌ట తెలిసిన వారంతా.. వీర జ‌వాను కుటుంబాన్ని ఇంత‌లా అవ‌మానిస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. 
Tags:    

Similar News