ధరలు పెంచుతామంటున్నారు..కారు కొనేయాలా?

Update: 2015-12-11 04:09 GMT
గత నాలుగైదు రోజులుగా ప్రముఖ కార్ల కంపెనీలు ఒకటి తర్వాత ఒకటి.. కార్ల ధరలు పెంచుతామంటూ ప్రకటనలు చేయటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మారుతి కూడా చేరింది. ప్రముఖ వాహన సంస్థలైన హుందయ్.. ఫోర్డ్ మొదలు కొని పలు కంపెనీలు జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచనున్నట్లుగా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్లు కొనటం మంచిదేనా? తెలివైన పనేనా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

మరో 20 రోజుల్లో కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించిన నేపథ్యంలో కొత్త కార్లు కొనేందుకే ఇదే సరైన సమయమా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. తమ ఉత్పత్తుల మీద కనిష్ఠంగా రూ.20 వేల నుంచి రూ.30వేల వరకూ ధరలు పెంచే అవకాశం ఉందని కార్ల కంపెనీలు విడుదల చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో కారు గురించి ప్లాన్ చేసే వారి దృష్టిని ఈ ప్రకటనలు ఆకర్షిస్తున్నాయి. అయితే.. కార్ల కంపెనీలు చేస్తున్న ప్రకటల ఆధారంగా కార్లు కొనుగోలు చేయటం ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది. మరో 20 రోజుల్లో ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో.. కార్ల ధర పెరిగినా.. కొత్తకార్లు కొనుగోలు చేయటం బుద్ధి తక్కువ పనిగా నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త కారును సంవత్సరంలో ఏ రోజు కొన్నా.. దాన్ని అమ్మేటప్పుడు నెలను కాకుండా ఏడాదిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో 2015 ఏడాది మరో 20 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కానీకారు కొంటే.. అది 2015 మోడల్ మాత్రమే అవుతుంది. కారు అమ్మే సమయంలో దాదాపుగా రూ.25 నుంచి రూ.30 వేల మధ్య విలువ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడేదో రూ.20వేలు తక్కువకు వస్తుందని కారు కొంటే.. భవిష్యత్తులో రూ.30వేలు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొత్త కారు కొనుగోలుకు ఫిబ్రవరి చివర కానీ.. మార్చి కానీ సరైన సమయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ధరలు పెరుగుతున్నాయన్న హడావుడిలో.. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు సుమా.
Tags:    

Similar News