ఐపీఎల్ 75 రోజులు.. పెరగనున్న మ్యాచ్ లు

Update: 2022-06-30 00:30 GMT
క్రికెట్ లీగ్ లలో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) కథే వేరు.. ఆటకు ఆట.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. అన్నిటికి మించి వారివారి జాతీయ జట్లలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని దేశాల ఆటగాళ్లకు ఓ ప్రధాన అవకాశం. అందుకే పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ బిగ్ బాష్, బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ (బీసీఎల్), కరీబియన్ క్రికెట్ లీగ్ (సీసీఎల్).. ఇలా వేటికీ లేని స్టార్ డమ్.. ఐపీఎల్ కు దక్కింది.

15 సీజన్లు విజయవంతంగా..

రంగు రంగుల జెర్సీల్లో ఆటగాళ్లు.. చీర్ గర్ల్స్.. ఆకట్టుకునే ప్రకటనలు.. అబ్బో ఐపీఎల్ మొదటినుంచే అత్యంత విజయవంతం అయింది. భారత్ లో వేసవిలో దాని సందడి అంతాఇంతా  కాదు. ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది మన లీగ్. అయితే, ఇందులో ఒడిదొడుకులు లేకపోలేదు.

2013 స్పాట్ ఫిక్సింగ్, ఆ తర్వాత ఐపీఎల్ ఫౌండర్లలో ఒకడైన లలిత్ మోదీ కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం, చెన్నై, హైదరాబాద్ జట్లపై రెండేళ్ల వేటు.. ఇలా అవరోధాలను ఎదుర్కొంది. అయితే, వాటన్నిటినీ విజయవంతంగా దాటి.. మళ్లీ గాడిన పడింది. కానీ, కొవిడ్ రూపంలో పెద్ద గండం ఎదురైంది. దీంతో రెండేళ్లు టోర్నీ సాదాసీదాగా యూఏఈలో సాగింది. ఈ ఏడాది మాత్రం భారత్ లో దిగ్విజయంగా 15వ సీజన్ ను పూర్తిచేసుకుంది.

అదనంగా రెండు 10 జట్లతో

2022 ఐపీఎల్ సీజన్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతేడాది దాకా 8 జట్లే ఉండగా.. ఈసారి మరో రెండు జతయ్యాయి. మొత్తం 10 జట్లతో సాగిన లీగ్ లో తొలిసారి బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ విజయదుందుభి మోగించి మరింత ప్రత్యేకంగా నిలిపింది. కాగా, వచ్చే ఏడాది నుంచి భారత టీ20 లీగ్‌ను 75 రోజులపాటు (రెండున్నర నెలలు) నిర్వహించేలా బీసీసీఐ చర్యలను ముమ్మరం చేసింది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా టాప్‌ ఆటగాళ్లు పాల్గొనే లీగ్‌ను మరో రెండు వారాలు అదనంగా నిర్వహించనుంది. ఇప్పటికిప్పుడు మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని జై షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే నిర్వహిస్తామన్నాడు. ''ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్‌లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్‌ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. అదేవిధంగా టీ20 లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం'' అని జై షా తెలిపారు.

జట్లు పెరగవు.. మ్యాచ్ లు పెరుగుతాయి..

ఐపీఎల్ ను గతేడాది వరకు 8 జట్లతో, ఈ ఏడాది 10 జట్లతో నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి రోజులు పెరగనున్నప్పటికీ జట్ల సంఖ్య పెరగదు. ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో రెండు నెలలపాటు 74 మ్యాచ్‌లను నిర్వహించేవారు. ఇక  రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మాత్రం మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కించుకొంది. అలాగే 2024-2031 భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్‌ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ క్రమంలో అనుబంధ దేశాలతోపాటు టాప్‌ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని జై షా పేర్కొన్నారు.
Tags:    

Similar News