మా పూర్వీకులు హిందువులే: ముస్లిం ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-07-08 06:35 GMT
మా పూర్వీకులంతా హిందువులేన‌ని అసోం ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధిప‌తి, లోక్ స‌భ‌ ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హిందువులు త‌మ‌ పూర్వీకుల‌ని గోవధ వద్దు అని సూచించారు.

లోక్‌సభ ఎంపీ అయిన మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అసోం స్టేట్ జమియత్ ఉలమా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అసోం పశువుల సంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని ఆయ‌న‌ ప్రజలకు విన్న‌వించారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈద్-ఉల్-అదా సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని విజ్ఞ‌ప్తి చేశారు.

అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ దేశంలో ముస్లింలు, హిందువుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయలేద‌ని ఎంపీ అజ్మల్ వ్యాఖ్యానించారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా ముస్లింలు ఆవుల‌ను తిన‌కుండా హిందువుల‌తో క‌లిసి పండుగ చేసుకోవాల‌న్నారు.

త‌మ‌ పూర్వీకులందరూ హిందువులేన‌ని తెలిపారు. త‌ర్వాత‌ ఇస్లాం స్వీక‌రించార‌ని వెల్ల‌డించారు. ఇతర మతాల మనోభావాలను గౌరవించడమే మా అభిమత‌మ‌ని అజ్మల్ తెలిపారు.

భారతదేశంలోని చాలా మంది సనాతన ధర్మాన్ని పాటిస్తారని, ఆవును పవిత్ర జంతువుగా పరిగణిస్తుంటారని ఎంపీ అజ్మ‌ల్ చెప్పారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు నివాసమున్న ప్రాంతాల్లో గొడ్డు మాంసం లేదా దాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ గత సంవత్సరం అసోం ప్ర‌భుత్వం ఆమోదించిన పశుసంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని ఆయన ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.

మ‌మ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు ప్రతిస్పందించవ‌ద్ద‌ని సూచించారు. దీనికి బదులుగా ఆమెలాంటి వారికి దేవుడు మంచి బుద్ధిని ప్ర‌సాదించాల‌ని ప్రార్థించాల‌న్నారు. శిరచ్ఛేదం చేయడం మూర్ఖత్వం అని అజ్మల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
Tags:    

Similar News