మాజీ సీఎం ఆఫీస్ ముందు ఫ్లెక్సీ క‌ల‌క‌లం

Update: 2018-03-17 07:32 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో అస్స‌లు ఊహించ‌లేరు. నిన్న‌టి వ‌ర‌కూ బ‌ద్ద‌శ‌త్రువులుగా ఉన్న వారు.. రాత్రికి రాత్రి మిత్రులైపోవ‌టం ఖాయం. ద‌శాబ్దాల శ‌త్రుత్వం కూడా ఒక్క రోజులో మొత్తంగా మారిపోతుంది. మిగిలిన రంగాల్లో ఇలాంటి తీరు అస్స‌లు క‌నిపించ‌దు. ఇప్పుడు అలాంటి విచిత్ర‌మే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌నిపిస్తోంది.

ఒక ఒర‌లో రెండు క‌త్తులు అస్స‌లు ఇమ‌డ‌వు. కానీ.. బీజేపీ లాంటి జెయింట్ ను.. మోడీలాంటోడ్ని మ‌ట్టి క‌రిపించాలంటే కొన్ని అద్భుతాలు చోటు చేసుకోవాల్సిందే. అలాంటిదే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయంలో చోటు చేసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకుంది స‌మాజ్ వాదీ పార్టీ. అదెలా సాధ్య‌మైందంటే.. ఆ రాష్ట్రంలో ఉత్త‌ర‌ద‌క్షిణాలుగా ఉంటే ఎస్పీ.. బీఎస్పీ రెండు క‌లిసి పోవ‌టం.. క‌లిసి ఉమ్మ‌డిగా అభ్య‌ర్థి పెట్ట‌టంతో బీజేపీ అభ్య‌ర్థికి దిమ్మ తిరిగే షాక్ త‌ప్ప‌లేదు.

గోర‌ఖ్ పూర్ లాంటి హార్డ్ కోర్ బీజేపీ స్థానంలో.. 29 ఏళ్ల త‌ర్వాత బీజేపీయేత‌ర అభ్య‌ర్థిగా ఎంపీగా విజ‌యం సాధించ‌టానికి ఈ అద్భుత‌మైన కాంబినేష‌న్ కార‌ణ‌మైంది. మోడీ బ్యాచ్ కు చెక్ చెప్ప‌టం ఎలా? అన్న సందేహంలో ఉన్న అఖిలేశ్‌ కు.. మాయావ‌తికి ఇప్పుడు స‌మాధానం దొరికింది. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా ఎస్పీ ప్ర‌ధాన కార్యాల‌యం ఎదుట ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఫ్లెక్సీ.. పోస్ట‌ర్లు వెలిశాయి. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అనంత‌రం.. అఖిలేశ్‌.. మాయ‌వ‌తితో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఈ ఫ్లెక్సీలో మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే బీఎస్పీ వ్య‌వ‌స్థాప‌కుడు కాన్షీరాం.. ఎస్పీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ ఫోటోల‌తో పాటు.. మ‌రో ఎస్పీ నేత అజాంఖాన్ ఫోటోలు కూడా ఇందులో పెట్టారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అఖిలేశ్ ఆఫీసుముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయ‌న ఫోటో కంటే మాయావ‌తి ఫోటోను మ‌రింత పెద్ద‌దిగా పెట్ట‌టం. కొత్త మిత్రుడి మ‌న‌సు దోచుకోవ‌టానికి ఆ మాత్రం ప్ర‌యోగాలు చేయ‌టం త‌ప్పేం కాదు.

దీనికి బ‌దులుగా బీఎస్పీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో అఖిలేశ్ ఫోటోను పెద్ద‌దిగా ఉన్న ఫ్లెక్సీను ఏర్పాటు చేస్తే.. రెండు పార్టీల మ‌ధ్య ఇచ్చిపుచ్చుకునే వ్య‌వ‌హారం మ‌రింత మెరుగుప‌డ‌టంతో పాటు.. వీరిద్ద‌రి స్నేహం వ‌చ్చే ఏడాది జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపించ‌టం ఖాయం.

ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ప‌లితాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. త‌మ‌కు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన మాయావ‌తి వ‌ద్ద‌కు వెళ్లిన అఖిలేశ్ ఆమెకు ధ‌న్య‌వాదాలు చెప్ప‌టం ద్వారా.. మిత్రుడి మ‌న‌సును దోచుకున్నార‌ని చెప్పాలి. చూస్తుంటే..ఎస్పీ.. బీఎస్పీ మైత్రిబంధం రానున్న రోజుల్లో మోడీ బ్యాచ్ కు వ‌ణుకు పుట్టేలా చేయ‌టం ఖాయ‌మ‌న్నట్లుగా అనిపించ‌ట్లేదు?


Tags:    

Similar News