బాబుకు చుక్కలు చూపుతున్న మాయ - మమత?!

Update: 2019-05-12 08:41 GMT
కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం.. ఒకవైపు తనేమో ఢిల్లీలో చక్రం తిప్పాలని చంద్రబాబు నాయుడు తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన బీఎస్పీ అధినేత్రి మాయవతి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీల మధ్యన పూర్తిగా ఇరకాటంలో పడినట్టుగా తెలుస్తోంది.

వారిద్దరూ తమే ప్రధానమంత్రి కావాలనే తపనతో ఉన్నారు. ఈ విషయంలో వారు తమ కోరికలను దాదాపుగా బయట పెట్టుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అంతా ఏకం అయ్యి తమను ప్రధానిగా చేయాలనేది వారి లెక్కగా కనిపిస్తూ  ఉంది. ఈ కూటమికి అంతా తనే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తూ ఉన్నారు.

అందులో భాగంగా చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం డేటును కూడా అనౌన్స్ చేశారు. అయితే  ఆ మీటింగ్ విషయంలో చంద్రబాబుకు మాయవతి, మమతా బెనర్జీలు చుక్కలు చూపుతున్నారని సమాచారం. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో తమే ప్రధానమంత్రి అభ్యర్థి కావాలనేది వారిద్దరి కోరిక.

ఒకవేళ ఆ కూటమిలో గనుక తమకు అవకాశం రాకపోతే వారు ఆ కూటమిలో ఉండటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అంతే కాదు వీరి షరతులు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మాత్రమే మద్దతును ఇవ్వాలని వారు అంటున్నారట. కాంగ్రెస్ తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు రెడీగా లేరట. కాంగ్రెస్ తో కూటమి ప్రభుత్వం అయితే తమకు ప్రధానమంత్రి పదవి దక్కదనేది వారి లెక్క.

కాంగ్రెస్ తో కలసి కూటమి అంటే.. రాహుల్ గాంధీనే ప్రధాని అవుతాడు. అప్పుడు వీళ్లు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది వారికి సుతారమూ ఇష్టం లేదు. ఈ లెక్కలన్నింటితోనూ.. మాయ, మమతలు చంద్రబాబుకు చుక్కలు చూపుతున్నారని.. బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ ఏర్పడితే దానికి తమే హెడ్ అని అంటున్న వీరి తీరుతో చంద్రబాబు పూర్తిగా ఇరకాటంలో పడిపోతూ ఉన్నారని, వీరి తీరుతో ఇతర పార్టీలు ఎంత వరకూ ఈ కూటమిలో నిలబడతాయి.. అనేది కూడా సందేహంగా మారినట్టుగా సమాచారం.

కాంగ్రెస్ గనుక నూటా యాభైకి పైగా ఎంపీ సీట్లను సాధించుకుంటే ప్రధాని పీఠాన్ని కూటమిలోని మరెవరికీ వదలదు, మరోవైపు మాయవతి ఫలితాలు వచ్చాకా రూటు మార్చి బీజేపీకి సపోర్ట్ చేసినా పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదనే మాటా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి విషయంలో చంద్రబాబు నాయుడి గేమ్ ప్లాన్స్ సాగేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.



Tags:    

Similar News