మాయావ‌తికి కాంగ్రెస్‌ చెయ్యిచ్చిందిగా...!

Update: 2019-09-17 11:25 GMT
మాయావ‌తి. ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనేక వేదిక‌ల‌పై వంగి వంగి పాదాభివంద‌నం చేసిన మ‌హిళా రాజ‌కీయ నాయ‌కురాలు - మాజీ సీఎం - ప్ర‌స్తుతం ఎంపీ(రాజ్య‌స‌భ‌). ఓ ప్రాంతీయ పార్టీకి అధ్య‌క్షురాలిగా ఉంటూనే త‌న‌దైన శైలిలో మాట‌ల‌తూటాలు పేల్చ‌డంలోను - త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేయ‌డంలోనూ పేరు తెచ్చుకున్న యూపీ నేత‌. హిందీ బెల్ట్‌ లోని కీల‌క మైన రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు సీఎంగా చేసిన మాయావ‌తి బీఎస్సీకి అధినేత్రి. ద‌ళితుల పార్టీగా దీనిని నిమ్న‌వ‌ర్గాల‌కు చేరువ చేయడంలో ఆమె త‌న రాజ‌కీయ గురువు కాన్షీరామ్‌ ను మించిపోయారు.

ఈ క్ర‌మంలోనే ఆమె ఈ పార్టీని అన్ని రాష్ట్రాల్లోనూ విస్త‌రించేందుకు ప‌క్కా వ్యూహం వేసుకుని అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట‌. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు - శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. ఈ సూత్రం ఎంత‌మంది పాటిస్తున్నారో తెలియ‌దు కానీ - మాయావ‌తి మాత్రం ఖ‌చ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. గంట కింద‌ట ప‌చ్చి దూష‌ణ‌లు చేసుకున్న పార్టీల‌తోనూ ఓ గంట త‌ర్వాత చేతులు క‌లిపే రాజ‌కీయ వ్య‌క్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే యూపీలో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ - బీఎస్సీలు క‌లిసి పోటీచేశాయి. అధికారం కోసం ఈ రెండు పార్టీలూ కూడా క‌త్తుల నూరుకున్న విష‌యం తెలిసిందే. ఒకరిపై ఒక‌రు కేసులు కూడా పెట్టుకున్నాయి.

అలాంటి పార్టీ - ముఖ్యంగా కాంగ్రెస్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించిన పార్టీ..రాజ‌కీయ అవ‌స‌రాల కోసం అదే పార్టీతో అనేక మార్లు చేతులు క‌ల‌ప‌డం - విడిపోవ‌డం గ‌తంలో మ‌నం చూశాం. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పంజాబ్ ఎన్నిక‌ల్లో బీజేపీని - మోడీని ఓడించాల‌నే నిర్ణ‌యంతో మ‌రోసారి చేతులు క‌లిపేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇంత‌లోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. రాజ‌స్థాన్‌ లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు బీఎస్పీకి శ‌రాఘాతంగా మారిపోయాయి. రాజస్థాన్‌ లో బీఎస్పీ టికెట్‌ పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. ఏనుగుపై నుంచి దిగి హస్తం గూటికి చేరారు.

కాంగ్రెస్‌ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉదయ్‌ పూర్‌ వతి ఎమ్మెల్యే రాజేంద్ర గుడ్ - నడ్బాయ్ ఎమ్మెల్యే జోగేంద్ర సింగ్ అవనా  - వజీబ్ అలీ - లఖన్ సింగ్ మీనా - సందీప్ యాదవ్ - మరియు దీప్‌ చంద్ కేరియాలు ఉన్నారు. రాజస్థాన్‌ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ తో వీరు టచ్‌ లో ఉన్నారు. ఇక మంగళవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ ను కలిసి తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చారు. రాజస్థాన్‌ లో చెలరేగుతున్న మత ఘర్షణలపై పోరాడుతూ అదే సమయంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ సుస్థిరత కోసం - రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలన్న కాంక్షతో కాంగ్రెస్‌ లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప‌రిణామం.. పంజాబ్‌ లో చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్న బీఎస్పీ-కాంగ్రెస్‌ ల‌పై ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News