ఫేస్ బుక్ - వాట్సప్ - ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లను ఎలా వాడాలో ఎందుకువాడాలో అలా కాకుండా... ఎలా వాడకూడదో, దేనికోసం వాడకూడదో అలా వాడేస్తుంటారు కొంతమంది. ఇలా ఉపయోగించిన వారు చాలా మంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లిన సంగతి తెలిసినప్పటికీ జనాలు మారడం లేదు. అలా మారని ఒక యువకుడు ఫేక్ న్యూస్ ఒకటి వాట్సప్ లో షేర్ చేశాడు.. దీంతో వ్యవస్థ మొత్తాన్ని కదిలించాడు, మీడియాలో హాట్ న్యూస్ సృష్టించాడు.. చివరకు అది సరదా కోసం చేసిన పని అని ప్రకటించాడు.
వివరాళ్లోకి వెళ్తే... కుక్క మాంసంతో బిర్యాని తయారు చేస్తున్నారని ఒక న్యూస్ ను వాట్సాప్ లో షేర్ చేశాడు ఎంబీఏ విద్యార్థి వలబోజు చంద్రమోహన్. తల నరికిన కుక్కల ఫోటోలతో పాటు షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు కూడా చేశారని ఫేక్ న్యూస్ ను ఆ రెస్టారెంట్ కు వెళ్తున్న తన స్నేహితులను భయపెట్టడానికి ఫార్వర్డ్ చేశాడు. దీంతో షాక్ కు గురైన చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను మరికొన్ని గ్రూప్ లకు ఫార్వాడ్ చేశారట. వాట్సాప్ గ్రూప్ లను పరిశీలించుకుంటూ వెళ్లగా చంద్రమోహన్ ఫేక్ న్యూస్ ను పంపినట్లు గుర్తించిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
షా గౌస్ హోటల్ యజమానిని కుక్క మాంసం బిర్యానీ విషయాన్ని అన్ని ప్రముఖ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో నగరమంతటా ఒక్కసారిగా కలకలం రేగడం, జీ.హెచ్.ఎం.సీ. హెల్త్ అధికారులు షా గౌస్ హోటల్ పై రైడ్ నిర్వహించడం జరిగిపోయింది. దీంతో ఫేక్ న్యూస్ కారణంగా తమ హోటల్ పరువుపోయిందని ఆ రెస్టారెంట్ యజమాని మహమ్మద్ రబ్బానీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరిపి ఆ యువకుడిని ను అరెస్టు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/