పెళ్లిపై మాటా మాట‌..వీడియో కాల్ లో సూసైడ్‌

Update: 2018-02-19 05:00 GMT
ఆవేశం విచ‌క్ష‌ణ‌ను ఓడిస్తుంది. క‌న్న‌వాళ్ల‌కు క‌డుపుకోత‌ను మిగులుస్తున్నాయి. సున్నితంగా ఉండాల్సిన ప్రేమ ఇప్పుడు తీవ్ర నిర్ణ‌యాల‌కు కార‌ణంగా మారుతోంది. ప్రేమించిన వాళ్లు ద‌క్క‌క‌పోతే ప్రాణాలు తీయ‌ట‌మో.. తీసుకోవ‌ట‌మో ఎక్కువ అవుతోంది. క‌ని.. పెంచి.. పెద్ద‌వాళ్లను చేసిన త‌ల్లిదండ్రులు.. కుటుంబం గురించి ప‌ట్ట‌క‌.. ప్రేమించినోళ్ల కోసం ప్రాణాలు తీసుకుంటున్న వైనం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

తాజాగా హైద‌రాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. అనంత‌పురం జిల్లాకు చెందిన అమ్మాయి ఒక‌రు హైద‌రాబాద్ లో చ‌దువుకుంటోంది. అదే కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థితో ప‌రిచ‌యం ప్రేమగా మారింది. ఇప్పుడ‌ది ఆమె ప్రాణాలే పోయేలా చేసింది. అనంత‌పురానికి చెందిన హ‌నీషా చౌద‌రి హైద‌రాబాద్ కొంప‌ల్లిలోని శివ‌శివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కాలేజీలో చ‌దువుకొంటోంది. హాస్ట‌ల్ లో ఉండే ఆమెకు అదే కాలేజీలో చ‌దివే దీక్షిత్ ప‌టేల్ తో ప‌రిచ‌యం ఉంది. అది కాస్తా ప్రేమ‌గా మారింది. గుజ‌రాత్ కు చెందిన దీక్షిత్ ప‌టేల్ కొద్దికాలం క్రితం హైద‌రాబాద్‌ కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు.

స‌ర‌దాగా మాట్లాడుకునేందుకు వీడియో కాల్ మాట్లాడిన ఆ యువ‌తి.. కాసేప‌టికే ఇరువురి మ‌ధ్య మొద‌లైన వాద‌న అంత‌కంత‌కూ పెరిగింది. పెళ్లికి సంబంధించి ఇరువురి మ‌ధ్య మాట‌లు పెరిగి.. ఆవేశంతో వీడియో కాల్ లోనే ఆమె ఉరి వేసుకుంది. వీడియో కాల్ లో ఉరి వేసుకుంటున్న హ‌నీషాను చూసిన దీక్షిత్ వెంట‌నే ఆమె ఉండే హాస్ట‌ల్ కు వెళ్లి.. అక్క‌డి సిబ్బందికి చెప్పాడు. వారు ఆమె ఉన్న త‌లుపులు బ‌ద్ధ‌లు కొట్టి ఆమె వ‌ద్ద‌కు వెళ్లారు.

అప్ప‌టికే అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  అయితే అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు నిర్దారించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆసుప‌త్రికి చేరుకొని దీక్షిత్ ప‌టేల్ ను అదుపులోకి తీసుకున్నారు. కుమార్తె ఆత్మ‌హ‌త్య వార్త తెలిసినంత‌నే బోరున విల‌పిస్తూ అనంత‌పురం నుంచి బ‌య‌లుదేరి వ‌చ్చారు హ‌నీషా త‌ల్లిదండ్రులు. హ‌నీషా తండ్రి బుగ్గ‌య్య చౌద‌రి అనంత‌పురంలో తెలుగుదేశం పార్టీ నేత‌గా సుప‌రిచితుడు.

చ‌దువు పూర్తి చేసుకొని వ‌స్తుంద‌నుకున్న కుమార్తె.. క‌ళ్ల ముందే విగ‌త‌జీవిగా మార‌టంతో హ‌నీషా త‌ల్లిదండ్రులు తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. గుండెలు అవిసేలా రోదించారు. కుమార్తె మృత‌దేహాన్ని తీసుకొని అనంత‌కు వెళ్లారు. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. మంత్రి ప‌రిటాల సునీత‌.. ఎమ్మెల్యేలు.. నేత‌లు హ‌నీషా మృత‌దేహానికి నివాళులు అర్పించారు. హ‌నీషా చౌద‌రి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలుసుకునేందుకు అదుపులోకి తీసుకున్న దీక్షిత్‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News