కేసీఆర్ డీల్ ను ఓపెన్ చేసిన తెలుగు త‌మ్ముడు

Update: 2019-04-02 05:26 GMT
పార్టీ టికెట్ ఇస్తాన‌న్న హామీ వ‌చ్చిన వెంట‌నే.. కండువా మార్చేసిన తెలుగు త‌మ్ముళ్ల‌ను చాలామందిని ఏపీలో చూశాం. మ‌రో పెద్దాయ‌న బాబుకు ఇచ్చిన హ్యాండ్ మామూలుగా లేద‌ని చెబుతారు. కాంట్రాక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించే టీడీపీ నేత ఒక‌రు ఏపీ ప్ర‌భుత్వంలో వంద‌ల కోట్ల‌కు ప‌నులు చేశారు. దాదాపు రూ.400 కోట్ల వ‌ర‌కూ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నిక‌ల వేళ‌.. నిధుల అవ‌స‌ర‌మంటూ అధినేత చెవిలో జోరీగ‌గా మారి.. మొత్తానికి త‌న బిల్లుల పేమెంట్స్ మొత్తాన్ని పాస్ చేసుకొని.. త‌న బ్యాంకు ఖాతాలోకి త‌ర‌లించుకున్నారు.

ప్ర‌భుత్వ అకౌంట్ నుంచి ఫండ్స్ త‌న వ్యాపార ఖాతాలోకి ప‌డిన వెంట‌నే.. ప‌త్తా లేకుండా పోయిన స‌ద‌రు నేత‌.. వేరే పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌టం బాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింద‌ని చెబుతారు. ఇలాంటి త‌మ్ముళ్లు ఉన్న పార్టీలో అందుకు భిన్నంగా ఉండే బ్యాచ్ కూడా కొంద‌రుంటారు. అలాంటి వారికి చెందిందే తాజా క‌థ‌నం.

మొన్న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో టీడీపీ గెలుచుకున్న రెండు సీట్ల‌లో అశ్వారావు పేట నుంచి టీడీపీ అభ్య‌ర్థి మెచ్చా నాగేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించ‌టం తెలిసిందే. ఆయ‌న్ను గులాబీ కారు ఎక్కించేందుకు ఇప్ప‌టికే ప‌లు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ.. ఆయ‌న నో అన‌టంతో విష‌యం ముందుకు వెళ్ల‌లేదు.

తాము గాలం విస‌రాలే కానీ ప‌డ‌ని నేత ఉండ‌ని రోజుల్లో అందుకు భిన్నంగా మెచ్చా ఉండ‌టం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక ప‌ట్టాన న‌చ్చ‌లేద‌ని చెబుతారు. అందుకే.. మెచ్చాను పార్టీలోకి తెచ్చేందుకు అదేప‌నిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. కారు ఎక్కించే ప‌నిలో భాగంగా ఒత్తిళ్ల‌ను అంత‌కంత‌కూ పెంచుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. మీడియా ముందుకు వ‌చ్చిన మెచ్చా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాను టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ లోకి చేరిన ప‌క్షంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ మాట ఇచ్చిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు.  అయితే.. త‌న‌కు టీఆర్ ఎస్ లో చేర‌టం ఇష్టం లేద‌ని.. డ‌బ్బుకు.. ప‌ద‌వుల‌కు లొంగే వ్య‌క్తిని తాను కాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మెచ్చా త‌ర‌హాలో చాలామంది మాట‌లు చెప్పి..ఆ త‌ర్వాత చెంగున దూకేయ‌టాన్ని మ‌ర్చిపోలేం. మ‌రి.. మెచ్చా ఒకే ఒక్క‌డిగా ఉండిపోతారా?  లేక‌.. ఆయ‌న కూడా మిగిలిన వారి మాదిరి ఒత్తిడికి లొంగి కేసీఆర్ ఇచ్చిన ప‌ద‌వితో సంతృప్తి చెందుతారా? అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Tags:    

Similar News