విశాఖలో ఎరుపు మేఘాలు... ?

Update: 2021-10-29 17:30 GMT
విశాఖలో ఏముంది అంటే గంభీర సాగరం అని చెబుతారు. అదే అహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ సిటీ ఆఫ్ డెస్టినీకి సరికొత్త మెరుపులు అద్దుతోంది. అదే విశాఖ కన్నెర్ర చేస్తే ఆ ఎరుపుని కూడా తనలో చూపిస్తూ ఎర్రబారుతుంది కూడా. ఉద్యమాలకు పుట్టిల్లుగా విశాఖ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో విశాఖలో ఉన్నాయి. దాంతో ఏ మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఉవ్వెత్తున కార్మిక లోకం ఉద్యమంలా ఎగిసిపడుతుంది. ఇపుడు విశాఖలో అలాంటి పరిస్థితే ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కొన్ని దశాబ్దాల క్రితం అంతా కలసి పోరాడి సాధించుకున్న ప్లాంట్ ఇపుడు ప్రైవేట్ కాబోతోంది. దాంతో గత పది నెలలుగా కార్మిక లోకం ఉద్యమిస్తోంది. అది అన్ని దశలూ దాటి పీక్స్ కి చేరుకుంది.

విశాఖకు జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక కన్వీనర్ మధా పాట్కర్ వస్తున్నారు. ఆమె ఈ నెల 30న విశాఖలో జరిగే ఉక్కు కార్మికుల ఉద్యమంలో పాలుపంచుకుంటారు. విశాఖ గడ్డ మీద నుంచి మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా  నిలదీస్తారు. కేంద్రం ప్రైవేటీకరణ పాలసీని కూడా ఆమె ఎండగడతారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా చాటి చెప్పనున్నారు. మేధా పాట్కర్ కి జాతీయ  ఉద్యమ నాయకురాలిగా ఎంతో చరిత్ర ఉంది. ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నెలల తరబడి పోరాటం చేస్తున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహించి తన వంతుగా విశాఖ నుంచే ఉద్యమ శంఖారావాన్ని వినిపిస్తున్నారు.

మరో వైపు చూస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 30న విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్రసంగం చేస్తారు. విశాఖ ప్లాంట్ ని ప్రవేటీకరిస్తే చూస్తూ ఊరుకోమని పవన్ కూడా చాటి చెప్పనున్నారు. పవన్ సభకు అన్ని ఏర్పాట్లు  పెద్ద ఎత్తున చురుకుగా జరుగుతున్నాయి. ఒకే రోజున అటు పవన్, ఇటు మేధా పాట్కర్ వంటి వారు విశాఖ రావడం, ఉక్కు కోసం పోరు సలపడం బట్టి  చూస్తూంటే విశాఖలో ఎరుపు మేఘాలు నలు వైపులా కమ్ముకున్నాయనే అంటున్నారు. ఈ పోరుని యావత్తు దేశం చూసేలా చేస్తామని ఉక్కు ఉద్యమ నాయకులు చెబుతున్నారు. ఈ దెబ్బతో కేంద్రం ప్రైవేటీకరణను విరమించుకోవాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఈ వీకెండ్ విశాఖకు వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఉక్కు పోరాట అనుకూల  నినాదాలతో విశాఖ నేల దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.
Tags:    

Similar News