ప‌వ‌న్‌ కు మీడియా ఇచ్చిన తొలిషాక్ ఇదే

Update: 2018-05-03 08:05 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు మీడియాతో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలిసివ‌చ్చిందంటున్నారు. మీడియాను టార్గెట్ చేసుకున్న స్వ‌ల్ప‌కాలంలోనే ఆయ‌న‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ వ్యాఖ్య‌లు సాక్షాత్తు జ‌న‌సేన పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. తన ఎన్నికల స్టాటజీని ప్రకటించిన పవన్ వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో పోటీచేయడంపై మాత్రం ఆగస్టులో నిర్ణయం తీసుకుంటామన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని జనసేనాని వివ‌రించారు. పార్టీకి ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేకపోయినా ప్రతీ కార్యకర్తకు రెండు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉందని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

సహ‌జంగా ప‌వ‌న్ ఇంత‌టి కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేస్తే ఏం జ‌రుగుతుంది?  మీడియాలో హోరెత్తుతుంది! ప్రత్యేక చ‌ర్చాగోష్టులు - వివిధ పార్టీల నాయ‌కుల‌ను లైవ్‌ లోకి తీసుకోవ‌డం వంటివి జ‌రిగేవి. కానీ ఈ సారి సీన్ రివ‌ర్స్ అయింది. తెలుగుదేశం స‌న్నిహిత మీడియా అనే పేరున్న కొన్ని టీవీ చానల్లు ఈ అంశంపై చ‌ర్చాగోష్టికాదు క‌దా క‌నీసం ఓ కీల‌క వార్త‌గా కూడా చూడ‌లేద‌ని జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌న‌సేన పార్టీ పేరుతో పత్రికా ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుదల‌ చేసిన‌ప్ప‌టికీ ఆయా మీడియా సంస్థ‌లు వాటిని ఏదో ఓ వార్త‌గా భావిస్తున్నాయే త‌ప్ప ఒక‌ప్ప‌టికీ గొప్ప ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది త‌మ స‌త్తాను చాటుకునేందుకు ఆయా మీడియా సంస్థ‌లు ప‌వ‌న్‌ కు ఇచ్చిన సిగ్న‌ల్ అని పేర్కొంటున్నాయి.

మ‌రోవైపు జ‌న‌సేన గురించి నెగెటివ్ క‌థ‌నాలు మొద‌ల‌య్యాయ‌ని కూడా వివ‌రిస్తున్నారు. జ‌న‌సేన వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌క‌టించిన దేవ్ గురించి ప‌లు క‌థ‌నాలు వెలువ‌రిస్తూ కొన్ని మీడియాలు ప‌వ‌న్ ఆలోచ‌న తీరుపై ఎదురుదాడి చేశాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌ధాన మీడియాను ఎలా ఎదుర్కుంటారు?  ఆయ‌న బ‌ల‌మైన సాధ‌నంగా న‌మ్ముతున్న సోష‌ల్ మీడియా సామాన్యుల‌కు ఎంత మేర‌కు చేరువ కాగ‌ల‌దు అనే సందేహాలు స‌హ‌జంగానే జ‌న‌సేన శ్రేణుల్లో క‌లుగుతున్నాయ‌ని అంటున్నారు.

Tags:    

Similar News