గులాబీ ప్లీన‌రీతో మీడియాకు విందుభోజ‌నం!

Update: 2018-04-27 07:50 GMT
తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ ఎస్ ప్లీన‌రీ స‌మావేశాలు ఈ రోజు నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర శివారైన కొంప‌ల్లిలో స్టార్ట్ అయ్యాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు (స‌రిగ్గా లెక్కేస్తే.. అంత‌కంటే త‌క్కువ టైమే ఉంది) నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీలో తెలంగాణ‌లో త‌మ అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తోంది తెలంగాణ అధికార‌ప‌క్షం. టీఆర్ ఎస్ ప్లీన‌రీ ఏమో కానీ.. ఆ కార్య‌క్ర‌మం పుణ్య‌మా అని తెలుగు మీడియా సంస్థ‌ల‌కు మాత్రం కాసుల పంట‌గా మారింద‌ని చెబుతున్నారు.

అధికార‌ప‌క్షం.. అందునా ఎన్నిక‌ల ఏడాది. ఇలాంటి వేళ‌లో ఎవ‌రు ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంటారు.. స‌హ‌జంగానే వారు అధినేత‌తో స‌హా.. ప్ర‌ముఖుల క‌ళ్ల‌ల్లో ప‌డ‌తారు. ప‌త్రిక మొద‌టిపేజీని సైతం క‌ప్పేసే జాకెట్ యాడ్స్ తో ప‌లువురు నేత‌లు చెల‌రేగిపోతున్నారు. టీఆర్ఎస్ ప‌ట్ల‌.. అధినేత ప‌ట్ల త‌మ‌కున్న విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించుకునే క్ర‌మంలో ల‌క్ష‌లాది రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు పెడుతున్న ప‌రిస్థితి.

ఒక‌రికి మించి మ‌రొక‌రు అన్న‌ట్లుగా యాడ్స్ మీద యాడ్స్ ఇస్తున్న నేత‌లు తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉంది. అధికార‌ప‌క్షంలో త‌మ ఉనికిని ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి తేలికైన మార్గంగా జాకెట్ యాడ్స్ ను చెప్పుకోవాలి. ముఖ్య‌మంత్రి మొద‌లు గ‌ల్లీ నేత వ‌ర‌కూ అంద‌రూ పొద్దుపొద్దున్నే ప్ర‌ధాన ప‌త్రిక‌ల్ని ఒక‌సారి తిర‌గేయాల్సిందే. ఇలాంటి వేళ‌.. భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న ఇచ్చిన నేత ఎవ‌రా అన్న కుతూహ‌లం ఉంటుంది. అలా ప్ర‌తిఒక్క‌రికి అప్ర‌య‌త్నంగా రిజిస్ట‌ర్ కావ‌టానికి తేలికైన మార్గంగా జాకెట్ యాడ్స్ ను చెప్పుకోవాలి.

ఈ రోజు ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌ల్ని చూస్తే.. ఒక్కో ప‌త్రిక‌కు.. ఒక్కోనేత జాకెట్ యాడ్ తో ద‌ర్శ‌న‌మివ్వ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన గులాబీ నేత‌ల్లో మొన‌గాడంటే పార్టీ సీనియ‌ర్ నేత తేరా చిన్న‌ప‌రెడ్డినే చెప్పాలి. ఈనాడు లాంటి అగ్ర ప‌త్రిక‌లో జాకెట్ యాడ్ తో పాటు.. లోప‌లి రెండో పేజీ కూడా ఫుల్ పేజీ యాడ్ ఇవ్వ‌టం అంటే మాట‌లు కాదు. భారీ ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. దీన్ని లెక్క చేయ‌కుండా మొద‌టి రెండు పేజీల్ని బుక్ చేసుకున్నారు చిన్న‌ప‌రెడ్డి. త‌ర్వాత స్థానంలో.. అంత భారీగా క‌నిపించింది మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డినే. ఆయ‌న వ్య‌వ‌హారం మ‌రికాస్త ఆస‌క్తిక‌రం. ఫ్యామిలీ ప్యాకేజీ మాదిరి సాక్షి దిన‌ప‌త్రిక మొద‌టిపేజీలో నిండుగా త‌న ప్ర‌క‌ట‌న వేయించుకున్న మ‌హేంద‌ర్ రెడ్డి. . రెండో పేజీలో ఆయ‌న‌ స‌తీమ‌ణి సునీతా మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి ఫోటోల‌తో యాడ్ ఇచ్చేశారు.

ఆంధ్ర‌జ్యోతిలో ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి జాకెట్ యాడ్ ఇచ్చేశారు.  గ‌డిచిన కొంత‌కాలంగా ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా.. కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత‌లు పోటాపోటీగా జాకెట్ యాడ్స్ ఇవ్వ‌టం క‌నిపిస్తోంది. తాజా ప్లీన‌రీ సంద‌ర్భంగా మాత్రం వారు ప్ర‌ధాన‌ప‌త్రిక‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. కానీ.. టీఆర్ఎస్ పార్టీ అధికార‌ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌కు జాకెట్ యాడ్ ఇచ్చేసి పార్టీ ప‌ట్ల త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు.

జాకెట్ పేజీలో ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి జాకెట్ యాడ్ ఇచ్చేస్తే.. రెండో పేజీలో ఎంపీ మ‌ల్లారెడ్డి.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. ఎమ్మెల్యే వివేకానంద్ నిలువెత్తు ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. ఇక‌.. ఇంగ్లిషు ప‌త్రిక‌ల్లో టీఆర్ఎస్ ప్లీన‌రీ ప్ర‌క‌ట‌న‌ల యాడ్ పెద్ద‌గా క‌నిపించింది లేదు. ద‌క్క‌న్ క్రానిక‌ల్  జాకెట్ యాడ్ ను త‌ల‌సాని సాయి కిర‌ణ్ యాద‌వ్ పేరుతో ఇవ్వ‌టం క‌నిపించింది. చిన్న చిన్న ప‌త్రిక‌ల్లోనూ యాడ్స్ జాకెట్ యాడ్స్ ఇవ్వ‌టం క‌నిపించింది.   ప్ర‌ధాన‌ప‌త్రిక‌తో పాటు.. టాబ్లాయిడ్ లోనూ ప్లీన‌రీ యాడ్స్ హ‌డావుడి క‌నిపించింది. ప్రింట్ మీడియాతో పాటు టీవీ ఛాన‌ళ్ల‌లోనూ ప్లీన‌రీ యాడ్స్ హ‌డావుడికి క‌నిపించింది. ప్లీన‌రీ మాటేమో కానీ మీడియా సంస్థ‌ల‌కు మాత్రం ప్ర‌క‌ట‌న‌ల రూపంలో కాసుల గ‌ల‌గ‌ల్లాడాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రీ ప్ర‌క‌ట‌న‌లకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డిచిన కొద్దిరోజులుగా భారీ యాడ్స్ ఇచ్చిన వారి విష‌యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది కాల‌మే చ‌క్క‌టి స‌మాధానం ఇవ్వగ‌ల‌దు.
Tags:    

Similar News