ప్రైవ‌సీ మీడియా అధిప‌తుల‌కేనా?

Update: 2018-04-25 04:47 GMT
కాలం మారింది. ఇప్పుడు గుట్టు అన్న‌దేమీ లేదు. ఎవ‌రికి వారు.. గుప్పిట మూసేసి.. అందులో ఉన్న‌ది ఎవ‌రికీ తెలీద‌నుకుంటే? అంత‌కు మించిన అమాయ‌క‌త్వం మ‌రొక‌టి ఉండ‌దు. గుట్టు అన్న‌ది మీడియాకేనా?. ఎవ‌రికి ఉండ‌కూడ‌దా? ప‌బ్లిక్.. ప్రైవేటు జీవితాల‌కు మ‌ధ్య విభ‌జ‌న రేఖ చాలా చిన్న‌ది. చూసే కోణాన్ని బ‌ట్టి అది మారిపోతూ ఉంటుంది. ఒక సినీ ప్ర‌ముఖుడికి సంబంధించి ప్రైవేటు లైఫ్ దాదాపుగా ఉండ‌దు. ఎందుకంటే.. అత‌డికి సంబంధించిన ఏ అంశ‌మైనా.. ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తి ఉంటుంది కాబ‌ట్టి వార్త‌గా అచ్చేస్తుంటారు. అదేమంటే.. జ‌నాస‌క్తి అన్న మాట‌ను తెర మీద‌కు తీసుకొస్తుంటారు.

ఒక‌వేళ అదే నిజ‌మైతే.. మీడియా ఛాన‌ళ్ల‌కు చెందిన అధిప‌తులంతా అర్జెంట్ గా స‌మావేశ‌మై.. తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల్ని చ‌ర్చించుకోవ‌టంపై జానాస‌క్తి  ఉండ‌కుండా ఉంటుందా?  త‌మ‌పై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు క‌త్తి క‌ట్టార‌ని.. అలాంటి వాటిపై తాము ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశం అప్ర‌క‌టిత ఎజెండా అయిన‌ప్పుడు ఆ స‌మావేశం.. వాటి వివ‌రాలు వార్త‌లు కాకుండా ఉంటాయా? అని అడిగితే.. క‌చ్ఛితంగా వార్తే అంటారు.

కానీ.. ఈ ఉదంతంపై ఎలాంటి వార్త ఉండ‌దు. చివ‌ర‌కు ర‌హ‌స్య స‌మావేశం జ‌రిగిందంటూ క‌న్ఫ‌ర్మ్ చేసే వారే ఉండ‌దు. త‌మ‌కు సంబంధించిన అంశాలేవీ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డే మీడియా పెద్ద‌లు.. మిగిలిన వ‌ర్గాల‌కు చెందిన వారి విష‌యాల మీద కూడా ఇంతే గుట్టును ఎందుకు ప్ర‌ద‌ర్శించ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. త‌న త‌ల్లిని తిట్టిన వైనంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ష‌న్‌.. దాని త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలుగు టీవీ ఛాన‌ల్స్ కు చెందిన అధినేత‌లు.. వాటి ముఖ్యులతో క‌లిసి ఒక ప్రైవేటు స‌మావేశం అత్య‌వ‌స‌రంగా జ‌ర‌గ‌టం.. ఆ సంద‌ర్భంగా కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఏ విష‌య‌మూ బ‌య‌ట‌కు పొక్క‌లేదు. ఇదిలా ఉంటే.. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన సినీ ప్ర‌ముఖుల ర‌హ‌స్య మీటింగ్‌. గుట్టు ఎవ‌రికైనా గుట్టే. ఒక‌రి విష‌యంలో ఒక‌లా.. త‌మ విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్న మీడియా తీరు అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ విష‌యంలో అయినా తాము న్యాయంగా.. నీతిగా ఉంటామ‌ని నీతులు చెప్పే మీడియా అధినేత‌లు.. తాము ర‌హ‌స్యంగా జ‌రిపిన స‌మావేశ వివ‌రాల్ని వార్త‌ల రూపంలో అచ్చేస్తారా? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. ప్రైవ‌సీ అన్న‌ది మీడియా అధినేత‌ల‌కు మాత్ర‌మే కాదు.. అంద‌రికి ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని చెబుతున్నారు. గుట్టుగా మీడిగా అధిప‌తుల మీటింగ్ సాగాలి కానీ.. సినీ ప్ర‌ముఖుల స‌మావేశం మాత్రం సీక్రెట్ గా ఉండ‌కూడ‌దా?   రెండింటి మ‌ధ్య వేర్వేరు న్యాయం ఏమిటి? అంటూ సంధిస్తున్న ప్ర‌శ్నాస్త్రాల‌కు స‌మాధానం చెప్పే మీడియా పెద్ద మ‌నిషి ఎవ‌రైనా ఉన్నారా తెలుగు మీడియాలో..?
Tags:    

Similar News