ఆరోగ్య శాఖ హరీష్ రావుకు కలిసి వచ్చేనా?

Update: 2021-11-12 02:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన మంత్రులంతా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. తాటికొండ రాజయ్య మొదలు నిన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ వరకు అందరిదీ ఒకటే కథే. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఆరోగ్య శాఖకు ఏడేళ్లుగా సుస్తీ చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు కేటాయించడంతో అనేక రకాల ఊహగానాలు వెలుగుచూస్తున్నాయి.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అప్పగించారు. తెలంగాణ తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యకు కేసీఆర్ ఆరోగ్యశాఖను కేటాయించారు. అయితే ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఇప్పటి వరకు ఆయనను ఎందుకు బర్తరఫ్ చేశారనే కారణాలు కూడా వెల్లడికాకపోవడం గమనార్హం. ఆయన తర్వాత వైద్యశాఖను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అప్పగించారు.

అయితే లక్ష్మారెడ్డి నకిలీ సర్టిఫికెట్ తో వైద్యుడిగా చెలమణి అవుతున్నారని ఆరోపణలు విన్పించాయి. దీంతో ఆయనను ఆరోగ్య శాఖ మంత్రిగా ఎలా కొనసాగిస్తారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ వివాదాల మధ్యే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ అప్పగించారు. అప్పటికే ఆరోగ్య శాఖలో ఎన్నో సమస్యలు నెలకొనగా ఆ సమయంలో కరోనా మహమ్మరి రావడంతో ఈటలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.

ప్రభుత్వం ఆరోగ్య శాఖపై దృష్టిసారించి నిధులు కేటాయించడంతో ఈటల రాజేందర్ సజావుగానే తన శాఖను నెట్టుకొచ్చారు. అయితే అనుహ్యంగా అసైన్డ్ లైన్డ్ ను ఈటల రాజేందర్ ఆక్రమించుకున్నాడనే ఆరోపణలతో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రి పదవీని తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి తిరిగి ఇటీవల ఎన్నికయ్యారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో ఈటల నిరూపించుకున్నారు.

హూజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమి పాలవడంతో పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతుందని అంతా భావించారు. అయితే అనుహ్యంగా ఈటల నిర్వహించిన ఆరోగ్య శాఖనే మంత్రి హరీష్ రావుకు సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. గతంలో ఈటల నిర్వహించిన ఆర్థిక, ఆరోగ్య శాఖనే ప్రస్తుతం హరీష్ రావు చూస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న ఆరోగ్య శాఖను హరీష్ రావుకు కేటాయించడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రజల్లోకి ఏదైనా సంకేతాలు పంపిస్తున్నారా? అనే టాక్ సైతం నడుస్తోంది.

టీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ చేపట్టిన మంత్రులంతా అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రతిపక్ష విమర్శలకు తోడు అధికార పక్షం నుంచి తీవ్రంగా ఒత్తిడులు ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఈ శాఖను ఎవరు నిర్వహించి అది కత్తీ మీద సామేనని చెప్పొచ్చు. దీంతో ఈ శాఖను తీసుకునేందుకు ఎవరూ కూడా మందుకు రావడం లేదు. కాగా హుజూరాబాద్ ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో తనకు పట్టిన గతే హరీష్ కు పడుతుందని శాపనార్థాలు పెట్టడాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.

ఈటల గెలిచిన తర్వాత హరీష్ కు ఆరోగ్య శాఖను కేటాయిండటంతో టీఆర్ఎస్ లో నెక్ట్ టార్గెట్ హరీష్ రావేనా అన్న చర్చ సైతం నడుస్తోంది. మరీ హరీష్ రావు ఆరోగ్యశాఖకు వెన్నతెస్తారా? లేదంటే ఇతర మంత్రుల్లాగే ఇబ్బందులు పడుతారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే. ఏదిఏమైనా ట్రబుల్ షూటర్ కు టీఆర్ఎస్ లో రాబోయే కాలమంతా అంతా ఈజీ కాదనే టాక్ మాత్రం విన్పిస్తోంది.
Tags:    

Similar News