ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చి నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రత్యేక హోదా - విభజన హామీల విషయంలో కేంద్రం చేసిన మోసాన్ని దిగమింగుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఏపీలో ఎయిమ్స్ తో పాటు మరిన్ని విద్యాసంస్థలను మంజూరు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిన కేంద్రం....ఇప్పటివరకు ఆ దిశగా పెద్దగా చేసిందేమీ లేదని చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో ఏపీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి 850 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిరాకరించింది. ఆ నిర్ణయం వెంటనే అమలయ్యేలా ఉత్తర్వులను జారీచేసింది. త్వరలోనే ఎంబీబీఎస్ లో చేరదామని ఆతృతగా ఎదురుచూస్తోన్న విద్యార్థులు కేంద్ర ఆరోగ్యా శాఖ నిర్ణయంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు.
తాజాగా నీట్ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులంతా తమకు ఫలానా కాలేజీలో సీటు వస్తుందా అని అంచనాలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకుకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు రాకపోయినా....ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు పొందుదామని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా కేంద్రం నిర్ణయంతో చాలామంది విద్యార్థుల ఆశలు అడియాశలయ్యే అవకాశం ఉంది. ఆ 850 సీట్ల కోత వల్ల మెరుగైన ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీటు దక్కకపోవచ్చు. విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాల తోపాటు మరో 6 ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన సీట్లలో కోత పడింది. గీతమ్ డీమ్డ్ వర్సిటీ కావటంతో కన్వీనర్ కోటా సీట్లు ఉండవు. మిగిలిన 6 ప్రైవేటు కాలేజీల్లో ఉన్న 50 శాతం కన్వీనర్ కోటా సీట్లలో కోత పడింది. ఆ కాలేజీల్లో దాదాపు 350పైగా కన్వీనర్ కోటా సీట్లు పోనున్నాయని తెలుస్తోంది. ఏదో ఒక కాలేజీలో సీటు వస్తుందని ఊహించిన విద్యార్థులకు కేంద్రం గట్టి షాకిచ్చింది. మరి, ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.