గంటన్నర భేటీలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యులు ఏం చెప్పారు?

Update: 2022-02-18 10:30 GMT
రాష్ట్ర విభజన జరిగి దగ్గర దగ్గర ఎనిమిదేళ్లు అవుతోంది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న లెక్కలు ఎంతకూ తెగని పరిస్థితి. దీనికి కారణం ఎవరికి వారు వాదన మీదనే తప్పించి.. సమస్య పరిష్కారం దిశగా అడుగు వేయకపోవటమే కారణం. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక అధికారులతో కలిపి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వంలోని సబ్‌-కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది.

ఈ సమావేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన అనుకూల వాదనల్ని వారు వినిపించుకోవటం తప్పించి.. సమస్య పరిష్కారం చేసుకుందామన్న భావన ఏ రాష్ట్రానికి కనిపించలేదని చెప్పాలి. ఇదే విషయాన్ని మీడియా సైతం రాస్తే బాగుంటుంది. కానీ.. అలా రాస్తే.. మీడియా సంస్థల మీద సెంటిమెంటల్ దాడి జరిగే అవకాశం ఉందన్న ఆలోనతో ఎవరికి వారు మౌనంగా ఉండటం.. ఇరు రాష్ట్రాలకు ఒక అవకాశంగా మారింది.

ఉదాహరణకు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్తు బకాయిలపై నెలకొన్న సమస్యకు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏపీ జెన్ కో నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.12,532 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర అధికారులు వాదిస్తుంటే.. తమకే తెలంగాణ జెన్ కో నుంచి రూ.3442 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని.. వీటిని ఇప్పించేలా చేయాలని ఏపీ అధికారులు కోరారు. సమస్యను సాగదీయకుండా ఒకేసారి పరిష్కరించాలని తెలంగాణ అధికారులు కోరారు.

ఇంతకూ తెలంగాణకు ఏపీ అంత భారీ మొత్తం ఎలా అప్పు పడిందన్న విషయంలోకి వెళితే.. ఆ రాష్ట్ర అధికారుల వాదన ఏమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ఏపీ సర్కారుకు తెలంగాణ విద్యుత్తు సరఫరా ఆకస్మికంగా నిలిపివేసిందని.. దీంతో హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్.. ఏపీ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. కృష్ణపట్నం పవర్‌ ప్లాంటు నుంచి విద్యుత్తు సరఫరా కోసం చేసుకున్న పీపీఏలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

సీలేరు జల విద్యుత్కేంద్రం నుంచి కూడా విద్యుత్తు సరఫరా నిలిపివేసిందని.. దీంతో రాష్ట్రం తీవ్రంగా మోసపోయినట్లు వివరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ నుంచి ఏపీలోని అనంతపూర్‌, కర్నూల్‌ జిల్లాలకు విద్యుత్తును సరఫరా చేశారని, దీని తాలూకు బకాయిలు కూడా రావాల్సి ఉందని  తమ డిస్కంలు ఎక్కువ రేటుతో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇక.. ఏపీ వాదన భిన్నంగా ఉంది. మొత్తానికి ఏపీ వేసిన కోర్టు కేసుల్ని వెనక్కి తీసుకుంటే సామరస్య పూర్వకంగా ఇష్యూను పరిష్కరించుకుంటామని తెలంగాణ అధికారులు వెల్లడించటం గమనార్హం. మొత్తంగా చూసినప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి వారు పిడి వాదనే తప్పించి.. సమస్యను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి లేనట్లుగా కనిపించింది. ఇలా అయితే.. ఎన్నిసార్లు భేటీ అయినా ప్రయోజనం ఉండదనే చెప్పాలి.


Tags:    

Similar News