కేసీఆర్‌తో కీల‌క నేత‌ల భేటీలు.. బిజీబిజీ.. అంతా మోడీ టార్గెట్‌!!

Update: 2022-01-11 17:30 GMT
తెలెంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. కేంద్ర ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. తాజాగా వివిధ రాష్ట్రాల కీల‌క నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక ల‌స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి.. మోడీని ఎలా దింపాల‌నే వ్యూహంపై కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఆర్జేడీ నేత, బిహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్.. ముఖ్య‌మంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని పార్టీ ప్ర‌తినిధుల బృందం.. కేసీఆర్తో మ‌ర్యాద పూర్వ‌కంగా సమావేశమైంది.

ఈ భేటీలో జాతీయ రాజ‌కీయాలు, తెలంగాణలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల గురించి ప్ర‌ధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశంలో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్, ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలాయాద‌వ్ పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపే అంశాల‌పైనే కేసీఆర్‌తో వారు చ‌ర్చించార‌ని.. కేసీఆర్ నాయ‌క‌త్వానికి జై కొట్టే ఉద్దేశంలో ఉన్నార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో కేంద్రంపై క‌న్నేసిన కేసీఆర్‌.. త‌న‌కు క‌లిసి వ‌చ్చే నేత‌ల‌తో భేటీ అవుతున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల కింద‌ట త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తోనూ కేసీఆర్ బేటీ అయ్యారు.

ఇక‌, ఇటీవ‌ల వామపక్ష కీలక నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు... ఏవైఎస్ఎఫ్ జాతీయ మహాసభల కోసం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు హైదరాబాద్లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకం, రైతు విధానాలు, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని గ‌ద్దె దింపే వ్యూహాల‌పైనా వారు దృష్టి పెట్టార‌ని.. అప్ప‌ట్లోనేచ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


Tags:    

Similar News