మెగా ఉత్సాహం : జనసేనకు ప్లస్సా... మైనస్సా..?

Update: 2022-05-23 08:38 GMT
రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. కులం ఉంటుంది, మతం ఉంటుంది. ప్రాంతం ఉంటుంది. ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ బయటకు మాత్రం ఏ ఒక్కటీ కనిపించకుండా అందరివాడు అనిపించుకుంటేనే అందలాలు దక్కేది. సహజంగా ఈ దేశంలో పుట్టిన ప్రతీ వారికీ కులం అన్న ట్యాగ్ తగిలించేస్తారు. అది ఇష్టం ఉన్నా లేకపోయినా వెంట వస్తుంది.

అయితే వీలున్నంత మేరకు దాన్ని తగ్గించుకోవాలని చూసే వారే తెలివైన రాజకీయ నాయకులుగా ఉంటారు. వారే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా మెగా ఫ్యాన్స్ అంతా ఒక చోట సమావేశమై తామంతా జనసేనకు మద్దతు నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒక విధంగా చూస్తే ఇది మంచి పరిణామమే. జనసేనకు కొంత బలం చేకూరినట్లే.

అదే సమయంలో సినీ ఫ్యాన్స్ అంటేనే కొన్ని రకాలైన  గొడవలు ఉంటాయి. ఫలనా వారి సినిమా హిట్ అంటేనే ఒప్పుకోని నైజం ఫ్యాన్స్ కి ఉంటుంది. ఎంతసేపూ తమ వారే గ్రేట్ అని చెప్పుకునే అమాయకత్వం వారి సొంతం. మరి అలా అనుకున్నపుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటి కావడం అంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ కి మంటగానే ఉంటుంది కదా. లాజిక్ గా ఆలోచిస్తే ఇదే నిజం కదా.

అలా రాజకీయాల్లో అందరి వాడు అనుకున్న దాని ముద్ర నుంచి మా హీరో మా సొంతం అని మెగా ఫ్యాన్స్ అతి ఉత్సాహం కధ తెచ్చేసిందా అన్నదే ఇక్కడ సందేహం. అదే సమయంలో ఇక్కడ కులాల ఈక్వేషన్స్ కూడా గట్టిగానే పనిచెస్తాయి. ఫలానా కులం వారు ఫలనా వారికి మద్దతు అంటే మిగిలిన వారు ఇష్టం ఉన్నా కాస్తా గ్యాప్ మెయిన్ టెయిన్ చేస్తారు. ఇది కూడా కొంత ఇబ్బందే మరి.

ఇంకో వైపు చూస్తే టీడీపీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వారంతా జూనియర్, బాలయ్య ఫ్యాన్స్ గా విడిపోయినా ఎన్నికల వేళకు టీడీపీకే గుద్దుతారు కదా. మరి వారికి ఎవరు సీఎం కావాలీ అంటే చంద్రబాబునే చెబుతారు కదా. మరి పవన్ సీఎం అని మెగా ఫ్యాన్స్ అదికి ముందే రచ్చ చేస్తే రేపటి రోజున పొత్తు కధకు ఇది అడ్డంకిగా మారదా.  పైగా ఇలాంటివి జనసేన అధినాయకత్వాన్ని కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కదా.

ఇక ఫ్యాన్స్ ని రంగంలోకి దింపితే ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. అదే టై,  లో దూకుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఏమైనా ఆలా పొరపాట్లు తడబాట్లూ జరిగితే దాని వల్ల ఏకంగా పార్టీకే ఇబ్బంది వస్తుంది కదా. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫ్యాన్స్ అతి ఉత్సాహం పార్టీని విజయతీరాలకు చేర్చేలా ఉండాలి కానీ చేటు తేకూడదు అన్నదే అందరి మాట.

ఇంకో వైపు చూస్తే నిన్నటి దాకా పవన్ సినిమాలనే రాజకీయంగా టార్గెట్ చేసేవారు. ఇపుడు అంతా ఒక్కటే అంటే ఆ దెబ్బ వారికి కూడా పడదని గ్యారంటీ ఏముంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. అలాగే రాజకీయ వాసనలు లేకుండా ఉన్న హీరోలకు ఇపుడు ఆ నీడ పడడం కూడా ఇబ్బందికరమే. సినిమా అంటే అందరూ చూస్తారు. అందరూ కావాలి. రాజకీయాలకూ అదే కావాలి.  అందుకే రెండింటి మధ్య ఒక సున్నితమైన హద్దు ఉంది. అది దాటకుండా అభిమానం ఉండాలి

మొత్తం మీద చూస్తే మెగాభిమానుల సమావేశం వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ అయితే బయల్దేరింది. ఎవరు ఉన్నా కూడా అది జనసేన విజయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి కానీ వెనక్కి లాగేలా ఉండరాదు అన్నదే పెద్దల మాట అంటున్నారు. అలా జనసేనకు ప్లస్ గానే మెగాభిమానం కావాలని ఆశిస్తున్నారు.
Tags:    

Similar News