భారత్‌ ను హిందూ దేశంగా ప్రకటించాల్సిందే

Update: 2018-12-14 01:30 GMT
భారత్‌ ను హిందూ దేశంగా ప్రకటించాల్సిందంటూ మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఆర్‌ సేన్‌ వివాదానికి తెరలేపారు. స్వాతంత్య్రానంతరం మతం ప్రాతిపదికన దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌ తమ దేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించుకుందని - అదే తరహాలో భారత్‌ కూడా హిందూ దేశంగా ప్రకటించుకోవాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు స్థిర నివాస ధ్రువీకరణ పత్రం నిరాకరించడంపై ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ ను సోమవారం ఆయన తోసిపుచ్చితూ పై వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌ను మరో ఇస్లాం దేశంగా మార్చేందుకు ఎవరూ ప్రయత్నించకూడదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే దీన్ని అర్థం చేసుకుని చర్యలు తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నా. దేశ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనికి మద్దతిస్తుందని భావిస్తున్నా’ అని జస్టిస్‌ సేన్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

అలాగే దేశంలో పౌరులందరకీ ఏకరీతి చట్టం ఉండాలని, దేశ రాజ్యాంగాన్ని - నియమాలను గౌరవించని వారిని దేశ పౌరులుగా గుర్తించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భారతీయ చట్టాలను గౌరవించే ముస్లిం సోదరీ సోదరీమణులకు తాను వ్యతిరేకం కాదన్నారు. వారు ప్రశాంతంగా జీవించొచ్చని చెప్పారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి విద్వేషాన్ని రగుల్చుతున్నారని ఆరోపించారు. ‘ఇదెక్కడి తీర్పు? భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ దీన్ని గమనిస్తోందా? ఇండియా ఇస్లామిక్‌ దేశంగా మారదు. సెక్యులర్‌ - బహుళ అస్థిత్వ దేశంగానే ఉంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సరిహద్దు దేశాల నుంచి భారత్‌ కు వచ్చే పౌరులకు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే పౌరసత్వం కల్పించేలా చట్టం తేవాలని జస్టిస్‌ సేన్‌ కేంద్రాన్ని కోరారు.
Tags:    

Similar News